కాళోజీని పట్టించుకోనీ రాష్ట్ర ప్రభుత్వం

కాళోజీని పట్టించుకోనీ రాష్ట్ర ప్రభుత్వం

వరంగల్‍, వెలుగు: మహాకవి, పద్మవిభూషణ్‍, కాళోజీ నారాయణరావు జ్ఞాపకార్థం ఓరుగల్లులో  నిర్మిస్తున్న  కాళోజీ కళాక్షేత్రం పనులు ఎనిమిదేండ్లు గడిచినా పూర్తికాలేదు. హన్మకొండ హయగ్రీవచారి గ్రౌండ్‍లోని దాదాపు 4.5 ఎకరాల విస్తీర్ణంలో  రవీంద్రభారతిని తలదన్నేలా ఏడాదిలో కళాక్షేత్రం పూర్తి చేస్తామని 2014 సెప్టెంబర్‍ 9న పనులకు శంకుస్థాపన చేస్తూ సీఎం కేసీఆర్​ మాటిచ్చారు. అతిపెద్ద కాళోజీ విగ్రహం, గార్డెన్‍ ఉండేలా  చూడాలని ఆఫీసర్లను ఆదేశించారు.  రూ.50 కోట్లు తక్షణమే  రిలీజ్​ చేస్తామని చెప్పినా మాట నిలుపుకోలేదు. ప్రారంభంలో రూ.30 కోట్ల సివిల్‍ వర్క్స్​ను హైదరాబాద్‍కు చెందిన మెస్సర్స్ సిర్కో సంస్థ  దక్కించుకుంది. కానీ ప్రభుత్వం నుంచి సకాలంలో ఫండ్స్ రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి.

అప్పటి టూరిజం డెవలప్‍మెంట్‍ చైర్మన్‍ పేర్వారం రాములు, 2020లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‍కుమార్‍, గడిచిన రెండేళ్లలో టూరిజం శాఖ మంత్రి  శ్రీనివాస్‍గౌడ్‍ రెండు, మూడు సార్లు.. చివరికి ఓసారి మంత్రి కేటీఆర్ కళాక్షేత్రం పనులపై రివ్యూ చేశారు.  ఈ ఏడాది సెప్టెంబర్‍ 9న  నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని మాటిచ్చారు. ఈ క్రమంలో నేడు మరో కాళోజీ జయంతి వచ్చినా పనులు మాత్రం పూర్తికాకపోవడంతో మహాకవి అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.