మహిళా సాధికారత ఇప్పుడు యాదికొచ్చిందా?

మహిళా సాధికారత  ఇప్పుడు యాదికొచ్చిందా?

రాష్ట్రంలో 9 ఏండ్లుగా రోజురోజుకు మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పాలనను పూర్తిగా గాలికి వదిలేసి, నిత్యం రాజకీయ ఎత్తుగడల మీద కాలం వెళ్లదీస్తున్నారు.  తెలంగాణ ఏర్పడిన కొత్తలో రాష్ట్ర అభివృద్ధిపై ఎవరైనా విమర్శిస్తే ఆరు నెలల పసిగుడ్డు పాలన, పసిపాలన అని చెప్పి తప్పించుకున్నారు. ఇప్పుడు 9 ఏండ్లు దాటినా ప్రజల జీవితాల్లో పెద్దగా మార్పులు రాకపోగా పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అయింది.

కేసీఆర్ ​కుమార్తె కల్వకుంట్ల కవిత ఇటీవల ‘పార్లమెంట్​లో మహిళా రిజర్వేషన్​ బిల్లు, మహిళల సాధికారత’ గురించి మాట్లాడారు. ఆమె మాటలు లిక్కర్ స్కాములో ఆమె ఎంతలా కూరుకుపోయిందనే విషయాలను తెలిపేలా ఉందే తప్ప.. మహిళల అభ్యున్నతి కోసం నిజంగా మాట్లాడినట్లు లేదు.  గత 9 ఏండ్లుగా యాదికి రాని మహిళా రిజర్వేషన్​ బిల్లు ఇప్పుడెందుకు ఇంత అకస్మాత్తుగా తెరమీదకు వచ్చిందనేది ఆశ్చర్యకరమే! 2014 నుంచి 2018 తెలంగాణ క్యాబినెట్​లో ఏ ఒక్క మహిళా మంత్రి లేరు. అప్పుడు కవితకు మహిళల హక్కులు, సాధికారత ఎందుకు యాదికిరాలేదో మరి! 

మహిళల సమస్యలపై స్పందనేది?

ఎంతో మంది మహిళల పోరాటాల వల్ల మహిళ కమిషన్ వచ్చింది. కానీ అక్కడ ఆధిపత్య వర్గాలకే ప్రాధాన్యం దక్కుతున్నది. ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న వారికి నిరాశే మిగులుతున్నది. ఏడాది క్రితం సింగరేణి కాలనీలో ఆరేండ్ల చిన్నారిపై అత్యాచారం జరిగితే వెళ్లి కలవకపోగా, కనీసం స్పందించలేదు? దిశ, టేకు లక్ష్మీ సంఘటనల గురించి ఏనాడూ మాట్లాడలేదు. రాష్ట్రవ్యాప్తంగా కుల దూరహంకార హత్యలకు గురైన భువనగిరి రోజా రెడ్డి, జనగామ సుశ్రిత సంఘటనలు సహా హాజిపూర్ అమ్మాయిల దారుణాల గురించి ఏనాడూ కవిత మాట్లాడిన దాఖలాలు లేవు. మీ పార్టీ నేతల చేతిలో అత్యాచారాలకు గురవుతున్న అమ్మాయిలు, అవమానాల పాలౌతున్న మహిళా ఆఫీసర్ల పక్షాన నోరు మెదుపరు.

 తెలంగాణ ప్రజలకు తెలుసు

ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ​కోసం ఆస్పత్రికి వెళ్లి నలుగురు మహిళలు చనిపోయారు. బాధిత కుటుంబాలను కనీసం ఓదార్చారా? వీళ్లు మహిళలు కాదా? మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కదా? వీళ్లు చనిపోయింది. బాలింతలు అని చూడకుండా పోలీసులు పోడు భూముల లొల్లిలో మహిళలను అరెస్టు చేసి జైలుకు పంపినప్పుడు మహిళల హక్కులు ఎటుపోయాయి. వరంగల్ లో ఆరునెలల పాపపై దాడి, హైదరాబాద్ రామచంద్రపురం అనాథ ఆశ్రమం అత్యాచారాలు, సరూర్ నగర్ జూనియర్ కాలేజ్ లో దాదాపు 800 మంది విద్యార్థినులకు ఒకే ఒక్క టాయిలెట్ గురించి మహిళా పక్షపాతి అయిన కవిత ఎందుకు మాట్లాడరు. ర్యాగింగ్​ వేధింపులతో ప్రీతి నాయక్ ఐదు రోజులు నిమ్స్ లో చావు బతుకుల మధ్య ఉంటే కనీసం వెళ్లి పరామర్శించే తీరిక లేదా? మీరు మహిళల జనాభా దామాషా ప్రకారం రిప్రజెంటేషన్  కావాలని అంటున్నారు. మంచి విషయమే కానీ, ఇదే సూత్రం వెనుకబడిన తరగతులకు కూడా వర్తిస్తుంది కదా! మరి అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉన్న మీ పార్టీ 27శాతం మాత్రమే ఉన్న బీసీ రిజర్వేషన్లు 52 శాతానికి  ఎందుకు పెంచట్లేదు?  లిక్కర్ స్కాములో అరెస్ట్ కాబోతున్నందు వల్లే మహిళా రిజర్వేషన్​ బిల్లును తెరమీదకు తెచ్చారని తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ జాగృతిలో బహుజనులను మెడబట్టి బయటకు గెంటేసినప్పుడు ఎలా ఉండే. ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నారని పేరు మార్చుకొని మళ్లీ ప్రజల నుంచి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. జంతర్ మంతర్ దగ్గర మార్చి10న మీరు తలపెట్టే ధర్నా  మీ పార్టీ ఆధ్వర్యంలో ఎందుకు చేయట్లేదు? రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు, మహిళల హక్కులు కాలరాసినప్పుడు, మహిళలకు అవమానం జరిగినప్పుడు స్పందించని కవిత.. కానీ ఇప్పుడు మహిళా సాధికారత గురించి మాట్లాడటం హాస్యాస్పదమే. మహిళల కోసం లా కాలేజ్, ఆర్మీ కాలేజ్, కోడింగ్ కాలేజ్, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఇలా అనేక విద్యాలయాలు పెట్టి, పూర్ణ లాంటి ఆడపిల్లల కలలు నిజం చేసిన ఆర్ఎస్పీతోనే  మహిళా సాధికారత సాధ్యం.

మహిళా గవర్నర్​ పట్ల మీ తీరు సరైందేనా?

కల్వకుంట్ల కవిత మహిళా సాధికారత గురించి మాట్లాడుతుంటే జనం షాక్ ​అవుతున్నారు. బీఆర్​ఎస్​ పాలనలో గల్లీకి పది, పదిహేను బెల్ట్ షాపులు వచ్చాయి. అత్యాచారాలు, హత్యలు, నేరాలు పెరుగుతున్నాయి. ఎందరో మహిళలు వితంతువులుగా మారుతున్నారు. ఈ దారుణాలకు కవిత ముందు సమాధానం చెప్పాలి. బిల్లులు ఇవ్వకుండా మహిళా సర్పంచ్​లను వేధిస్తున్న తీరును ఎలా  చూడాలి? మొన్న ఎన్నికల టైంలో  తిరుగుతున్నప్పుడు బిల్లులు రాక మునుగోడు టౌన్ లో ఓ అధికార పార్టీ మహిళా సర్పంచ్ టిఫిన్ సెంటర్ పెట్టుకున్న ఉదంతం చూశాం. ఇదీగాక రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్​తో మీ ప్రభుత్వ వ్యవహార తీరు, మీ ఎమ్మెల్సీ అహంకారపూరిత మాటలను మీరు ఎందుకు ఖండించలేదు. 


– కొంగరి అరుణ, రాష్ట్ర అధికార ప్రతినిధి, బీఎస్పీ