
చెన్నై: ‘‘మనదేశం రకరకాల రుచులతో కూడిన విందు భోజనం లాంటిది. దాన్ని అందరం కలిసే తినాలి. అలాకాదని ఒకే డిష్‌ను అందరి నోళ్లలో బలవంతంగా కుక్కితే కక్కుకునే పరిస్థితి వస్తుంది”అంటూ హిందీని బలవంతంగా రుద్దడంపై నటుడు, ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ మండిపడ్డారు. భిన్నత్వంలో ఏకత్వం అనే ప్రామిస్తోనే దేశం రిపబ్లిక్‌గా ఏర్పడిందని, ఇప్పుడెవరో సుల్తాన్ లేదా షా దాన్ని చెరిపేయలేరంటూ కేంద్ర మంత్రి అమిత్ షాపై ఫైరయ్యారు. ఒక దేశం ఒక భాష విధానాన్ని వ్యతిరేకిస్తూ కమల్ సోమవారం ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు.
‘‘బెంగాలీలో రాసినప్పటికీ జాతీయ గీతాన్ని జనం సంతోషంగా పాడుకుంటారు. అన్ని భాషలు, సంస్కృతుల్ని గౌరవిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ దాన్ని రాశారు. కలిసున్న దేశాన్ని భాష పేరుతో విభజించొద్దు. మూర్ఖంగా ఆలోచించే కొందరి వల్ల జనం ఇబ్బందులు పడొద్దు. అసలు కేంద్రం భాషలు, సంస్కృతుల జోలికేరావొద్దు. ఒకవేళ హిందీని బలవంతంగా రుద్దితే జల్లికట్టును మించిన మహోద్యమాన్ని చూడాల్సిఉంటుంది’’అని కమల్ చెప్పారు. కామన్ లాంగ్వేజ్ ఉండాలని, ప్రజల్ని ఒక్కటిచేసేది హిందీ భాషేనని హిందీ దివస్ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. సౌత్‌లోని అన్ని పార్టీలూ మంత్రి ప్రపోజల్‌ను ఖండించాయి.