
దిగ్గజ దర్శకుడు మణిరత్నం-విశ్వనటుడు కమల్ హాసన్ కలయికలో వచ్చిన మూవీ ‘థగ్ లైఫ్’. నేడు గురువారం (జూన్ 5) ఈ మూవీ.. ఒక్క కన్నడలో మినహాయించి.. ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
ఇందులో త్రిష, శింబు, అభిరామి ప్రధాన పాత్రలలో నటించారు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లు కలిసి నిర్మించింది. ఈ చిత్రాన్ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్రి బ్యానర్ పై రిలీజ్ చేశాడు.
గ్యాంగ్‌స్టర్, మాఫియా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన థగ్ లైఫ్ ఎలా ఉంది? 1987లో మణిరత్నం-కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన నాయకుడును మించి ఉందా? వివాదాల్లో నిలిచి ఎట్టకేలకు రిలీజైన మూవీ హిట్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే:
ఢిల్లీలో చిన్న రౌడీగా ఉన్న రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్ ) పెద్ద గ్యాంగ్ స్టర్ స్థాయికి ఎదుగుతాడు. తన వల్ల చనిపోయిన ఓ వ్యక్తి కొడుకు అమర్ (శింబు)ను చేరదీసి సొంత కొడుకులా శక్తిరాజు పెంచుతాడు. అలా తన సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో శక్తిరాజుకు శత్రువుల సంఖ్య పెరుగుతుంది.
►ALSO READ | ThugLife: దుమ్మురేపిన అడ్వాన్స్ బుకింగ్స్: థగ్ లైఫ్ బడ్జెట్ ఎంత? హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టాలి?
అందరిని తట్టుకొని శక్తిరాజు తన సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ వస్తాడు.. అంతా సాఫీగా సాగుతోంది అనుకున్న సమయంలో ఒక హత్య కేసులో జైలుకు వెళ్తాడు శక్తిరాజు. దీంతో అమర్ వ్యాపార బాధ్యతలు తీసుకుంటాడు. కట్ చేస్తే, శక్తిరాజు బయటికి వచ్చేసరికి అమర్ బలవంతుడిగా ఎదుగుతాడు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న బలమైన బంధం.. ఉన్నట్టుండే చంపుకునేంత వైరంగా మారుతుంది.
అసలు వీరిద్దరి మధ్య గొడవకు ఇంద్రాణి (త్రిష) కారణమా? వాళ్ల జీవితాలలో శక్తి రాజు భార్య లక్ష్మి (అభిరామి), అన్నయ్య మాణిక్యం (నాజర్) పాత్రలేమిటీ? శక్తిరాజు-అమర్ మధ్య చోటు చేసుకున్న పరిణామాలేంటి? ఆ ఇద్దరి మధ్య పోరు చివరికి ఏ స్థాయికి వెళ్తుంది? ఎవరు పైచేయి సాధిస్తారు అన్నది సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి?
విశ్లేషణ:
కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో.. 1987 లో వచ్చిన నాయకన్.. తెలుగులో నాయకుడు సెన్సేషనల్ హిట్ అందుకుంది. దాదాపు 36 సంవత్సరాల తర్వాత మరోసారి ఈ మ్యాజిక్ రిపీట్ అవ్వడమే పెద్ద సంచలనంగా మారింది. గ్యాంగ్‌స్టర్, మాఫియా నేపథ్యంలో నాయకన్, నవాబు తీసి మణిరత్నం ఆకట్టుకున్నాడు. సరిగ్గా నవాబుకు దగ్గరగా థగ్ లైఫ్ తెరకెక్కిన ఫీలింగ్ ఇస్తుంది. 'నవాబ్'లో ఉన్న క్యారెక్టర్లను అటూ ఇటూ మార్చి... థగ్ లైఫ్ వచ్చిన అనుభూతి కలగడంతో ఎటువంటి సందేహం లేదు.
ఈ క్రమంలోనే నాయకుడు వంటి కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ చూసిన అభిమానులకు.. థగ్ లైఫ్ అనుకున్నంతగా ఆకట్టుకోదు. ఎందుకంటే, థగ్ లైఫ్.. 'పగలు, ప్రతీకారాలతో' రొటీన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందినట్టుగానే అనిపిస్తుంది కానీ, నాయకుడు ఇచ్చిన మెసేజ్, ఎమోషన్ ఇవ్వలేకపోయింది. నిజానికి ఇలాంటి గ్యాంగ్‌స్టర్ అంశాన్ని బేస్ చేసుకుని వచ్చిన కథల్ని.. ప్రేక్షకులు ఎన్నో సినిమాల్లో చూస్తూ వస్తున్నారు. అయితే, ఇది ముఖ్యంగా కమల్ వర్సెస్ శింబు మధ్య పోరు మీదే నడిచింది.
ఓ నాయకుడు, అతను పెంచుకునే వారసుడు.. ప్రత్యర్థులు ఆ పవర్‌ను లాక్కోవడానికి చేసే ప్రయత్నాలు.. ఈ సినిమా. ఇంకా అర్ధమయ్యేలా చెప్పాలంటే.. కాపాడిన పిల్లాడిని కొడుకులా చూసుకున్న తండ్రికి అతని నుంచి ద్రోహం ఎదురైతే ఎలా ఉంటుంది? అందుకు గల కారణాలు ఏంటనేదే థగ్ లైఫ్. ఫస్టాఫ్ లో ఎంట్రీ ఇచ్చే ప్రతి పాత్ర ఆసక్తి క్రియేట్ చేస్తోంది. అమర్ ను శక్తిరాజు తన కుడి భుజంగా అనుకోవడం, అంతలోనే ఓ మర్డర్ కేసులో శక్తిరాజు జైలుకెళ్లడం.. వంటి అంశాలు సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ కలిగిస్తాయి.
కానీ, ఆ తర్వాత కథ మరింత ప్రెడిక్టబల్‌గా మారుతుంది. చంపడానికి వచ్చిన అమ్మాయిని శక్తి రాజు పెళ్లి చేసుకోవడం, అదే క్రమంలో వేరొక మహిళ ఇంద్రాణిని అతను ఇష్టపడటం.. తమ్ముడిగా, కొడుకుగా చూసుకున్న అమర్.. ఉన్నట్టుండి ఇంద్రాణికి దగ్గరవ్వడం.. వీరిద్దరి మధ్య వైరం పెరగడం.. ఇటువంటి సీన్స్ లో మణిరత్నం స్క్రీన్ ప్లే కాస్తా ఫెయిల్ అయిన్నట్టు కనిపిస్తోంది.
కానీ, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మాత్రం బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి. ముఖ్యంగా కమల్, శింబు మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ బ్లాస్ట్ అయ్యేలా మణిరత్నం డిజైన్ చేసిన తీరు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది.
ఎవరెలా చేశారంటే:
కమల్ హాసన్‌తో పాటు శింబు అదరగొట్టారు. వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్ బెస్ట్ ఆఫ్ ది డికెడ్‌గా నిలుస్తాయి. శింబు స్టైలిష్ లుక్ మెస్మరైజ్ చేస్తోంది. త్రిష, అభిరామి తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. రొమాంటిక్ క్యారెక్టర్ లో త్రిష చూపుతిప్పుకోకుండా చేస్తోంది. అభిరామి ఎమోషనల్ క్యారెక్టర్ లో మెప్పిస్తుంది. పాత్ర పరిధి మేరకు నాజర్ నటించి ఆకట్టుకున్నాడు. జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మీ, సాన్య మల్హోత్రా వంటి స్టార్స్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు:
సినిమాటోగ్రఫర్ రవి కే చంద్రన్ సినిమాకు చాలా ప్లస్ పాయింట్. ఆయన చూపించిన చాలా ఫ్రేమ్స్ టెక్నికల్‌గా బాగా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం.
ఇకపోతే చివరగా.. కథకుడిగా, దర్శకుడిగా మణిరత్నం ఒకే అనిపించుకున్నాడు. కానీ, ఈ టైంలో రొటీన్ గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీని రాసుకోవడం కొత్తగా రుచించదు. మేకింగ్ పరంగా ఓ క్రాఫ్ట్‌ను ఎలా వాడుకోవాలో అన్నీ తెల్సిన మాస్టారు ఆయన. అయితే, ట్విస్టులు పెద్దగా రాసుకోకపోవడంతో అతని రైటింగ్ వెలితి కనిపిస్తోంది.