
సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్‌ఎం) పార్టీ చీఫ్ కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారు. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ బుధవారం ( మే 28 ) ఈ మేరకు ప్రకటించింది. తమిళనాడు నుంచి సల్మా, అడ్వకేట్ పీ. విల్సన్, ఎస్ఆర్ శివలింగం లను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించిన డీఎంకే.. కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎం కు ఒక రాజ్యసభ స్థానం కేటాయిస్తున్నట్లు తెలిపింది. పొత్తులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం డీఎంకే నేతృత్వంలోని కూటమితో కమల్ హాసన్‌కు చెందిన మక్కల్ నీది మయ్యమ్ చేతులు కలిపింది. ఈ ఏడాది రాజ్యసభ ఎన్నికలకు కూటమిలో భాగంగా ఎంఎన్‌ఎం ఒక స్థానాన్ని కూడా దక్కించుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో మద్దతు ఇచ్చినందుకు ఒప్పందంలో భాగంగా సీఎం ఎంకే స్టాలిన్ కమల్‌కు రాజ్యసభ సీటును హామీ ఇచ్చినట్టు సమాచారం.
మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కమలహాసన్.. ఎన్నికల్లో మాత్రం చిత్తు చిత్తు ఓడిపోయారు. ఒక్క సీటుగా కూడా గెలవలేదు. ఆ తర్వాత డీఎంకే పార్టీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కమలహాసన్ ను రాజ్యసభకు ఎంపీగా పంపించాలని డిసైడ్ అయ్యింది డీఎంకే పార్టీ.
Tamil Nadu | Salma, Advocate P Wilson and SR Sivalingam have been announced as DMK candidates for Rajya Sabha.
— ANI (@ANI) May 28, 2025
One seat has been allocated to Makkal Needhi Maiam as per the earlier agreement. pic.twitter.com/BLw8g1j3Pg
జూలై నెలలో తమిళనాడు నుంచి ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. డీఎంకే పార్టీకి నాలుగు సీట్లు గ్యారంటీగా వస్తాయి. అందులో ఒక సీటును కమలహాసన్ ఇవ్వాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిన తర్వాత.. కాంగ్రెస్ పార్టీ సైతం కమలహాసన్ కు మంచి ఆఫర్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే.. కాంగ్రెస్ పొత్తులో భాగంగా లోక్ సభ ఎంపీ సీటు ఇస్తామని ఆఫర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఆ ఆఫర్ ను తిరస్కరించారు కమలహాసన్. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా డీఎంకే పార్టీకి మద్దతు ఇచ్చారు కమలహాసన్.