
కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి, ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత కమల్ కాంత్ బాత్రా బుధవారం హిమాచల్ ప్రదేశ్‌లోని పాలంపూర్‌లో కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 77 సంవత్సరాలు. కాంత్ బత్రా మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు ట్వీట్ చేశారు. కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి శ్రీమతి కమల్‌కాంత్ బత్రా మరణం గురించి విచారకరమైన వార్త తెలిసింది. మృతుల కుటుంబానికి అపారమైన దుఃఖాన్ని భరించే శక్తిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామంటూ తెలిపారు.
కమల్ కాంత్ బాత్రా 2014లో హిమాచల్ ప్రదేశ్‌లోని హమీపూర్ నుంచి ఆప్ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థి అనురాగ్ సింగ్ ఠాకూర్ చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
కమల్ కాంత్ బాత్రా కుమారుడు, కెప్టెన్ విక్రమ్ బాత్రా 1999 జూలై 7వ తేదీన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ దళాలతో పోరాడుతూ 24 సంవత్సరాల వయస్సులో మరణించారు. మరణానంతరం అత్యున్నత యుద్ధకాల శౌర్య పురస్కారం పరమవీర చక్ర ఇవ్వబడింది. అతని పరాక్రమానికి గుర్తుగా బాత్రాను “టైగర్ ఆఫ్ ద్రాస్”, “కార్గిల్ సింహం”, “కార్గిల్ హీరో” పిలుస్తుంటారు. విక్రమ్ బాత్రా జీవిత కథ ఆధారంగా.. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా ‘షేర్షా’ చిత్రం 2021లో విడుదలైంది.