పల్లె పోరుకు సన్నద్ధం.. రిటర్నింగ్, పోలింగ్ అధికారులకు ట్రైనింగ్

పల్లె పోరుకు సన్నద్ధం..  రిటర్నింగ్, పోలింగ్ అధికారులకు ట్రైనింగ్
  • కామారెడ్డి జిల్లాలో 213 మంది రిటర్నింగ్ అధికారులు
  • ఇప్పటి నుంచే మద్దతు కూడగట్టుకుంటున్న ఔత్సాహికులు 

కామారెడ్డి, వెలుగు: పల్లె పోరుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ప్రక్రియపూర్తైంది. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, పోలింగ్ అధికారులకు గురు, శుక్రవారాల్లో శిక్షణా తరగతులు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు పక్రియ పూర్తి కాగా, ఫైనల్ ఓటరు లిస్టులు అధికారులు ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి, వివరాలను సీల్డ్ కవర్‌లో ప్రభుత్వానికి కలెక్టర్ పంపారు.   

జిల్లాలో ఇలా..   

జిల్లాలో 532 పంచాయతీలు, 4,656 వార్డులు, 233 ఎంపీటీసీ స్థానాలు, 25 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రిజర్వేషన్ల లిస్టును పూర్తి చేసి, అధికారిక ప్రకటనకు సిద్ధంగా ఉంచారు. గ్రామాల్లో ఓటర్ల సంఖ్య 6,39,730 మంది ఉండగా,  పురుషులు 3,07,508, మహిళలు 3,32,209, ఇతరులు 13 మంది ఉన్నారు. 

రిటర్నింగ్​, పోలింగ్ అధికారులకు ట్రైనింగ్​ 

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, పోలింగ్, అసిస్టెంట్ పోలింగ్ అధికారుల నియామక ప్రక్రియ పూర్తైంది. గురువారం రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు, శుక్రవారం పోలింగ్ అధికారులకు శిక్షణ నిర్వహించారు. జిల్లాలో 532 పంచాయతీలకు 213 రిటర్నింగ్, 213 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నియమించారు. వీరు నామినేషన్ల స్వీకరణ, అభ్యర్థుల గుర్తుల ప్రకటన తదితరవాటిని నిర్వహిస్తారు. 

174 నామినేషన్ల కేంద్రాలు, 640 పోలింగ్ అధికారులు, 18 అసిస్టెంట్ పోలింగ్ అధికారులు, 4,670 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 25 జడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలు, గుర్తులతో కూడిన సామగ్రి సురక్షితంగా స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచడం వరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. 

పోటీకి సై..  

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పక్రియ స్పీడప్ అయిన నేపథ్యంలో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాల కోసం పోటీకి ఔత్సాహికులు గ్రామాల్లో విస్తృతంగా శ్రమిస్తున్నారు. రిజర్వేషన్ పక్రియ అధికారికంగా ఖరారు కాకపోయినా, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 4 రోజులుగా పల్లెలో ప్రచారం చేసుకుంటున్నారు. మద్దతుదారులను కలిసి స్థానిక వర్గాల నుంచి మద్దతు మూటగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పలు గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.