కామారెడ్డి బరిలోకి బడా నేతలు

కామారెడ్డి బరిలోకి బడా నేతలు
  •     సీఎం కేసీఆర్​ పోటీతో రసవత్తరంగా మారిన స్థానిక రాజకీయం
  •     తాము బరిలో ఉంటామంటున్న లబాన్​ లంబాడీలు, గల్ఫ్​బాధితులు,ఫౌల్ట్రీ సంఘం ప్రతినిధులు​

కామారెడ్డి, వెలుగు : రాష్ట్ర రాజకీయాల్లో కామారెడ్డి హాట్​ టాపిక్​గా మారింది. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ఇక్కడి నుంచి పోటీకి సై అంటుండగా, తమ డిమాండ్ల సాధన కోసం ప్రయత్నిస్తున్న వివిధ వర్గాలు సైతం కామారెడ్డి వైపు చూస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్​తరఫున సీఎం కేసీఆర్​బరిలో నిలువనుండగా, తాజాగా కాంగ్రెస్​ తరఫున ఇక్కడి నుంచి రేవంత్​రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్​ను కట్టడిచేయడానికి ఇక్కడ రేవంత్​రెడ్డిని పోటీకి దింపాలని అధిష్టానవర్గం భావిస్తుందనే ప్రచారం జరుగుతోంది. అధిష్టానం ఆదేశిస్తే తాను పోటీకి సిద్ధమని రేవంత్​రెడ్డి సైతం పేర్కొన్నారు.

వివిధ సమీకరణల నేపథ్యంలో రేవంత్​ ఇక్కడి నుంచి పోటీ చేయకపోవచ్చనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కాగా కామారెడ్డి నుంచి తానే బరిలో ఉంటానని మాజీ మంత్రి షబ్బీర్​అలీ గతంలో ప్రకటించారు. ఫస్ట్, సెకండ్​ లిస్టుల్లో కామారెడ్డి అభ్యర్థిని కాంగ్రెస్​ ప్రకటించకపోవడంతో పొలిటికల్​గా చర్చలకు తావిస్తోంది. బీజేపీ స్థానిక నేతకే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మాజీ జడ్పీ చైర్మన్​ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆ పార్టీ తరఫున బరిలో నిలువనున్నారు.

ఈయన గత ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున నిలబడి ఓడిపోయారు. అనంతరం అయిదేండ్లుగా నియోజకవర్గంపై స్పెషల్​ ఫోకస్​చేశారు.  వివిధ సమస్యలపై ఆందోళనలు చేస్తూ నిరంతరం ప్రజల్లో ఉన్నారు. కేసీఆర్​పై బీజేపీ నుంచి ముఖ్య నేతలు పోటీ చేస్తారని ప్రచారం జరిగినా, అధిష్టానం చిరవకు రమణారెడ్డికే ఓకే చెప్పింది.

కేఏ పాల్ ​సైతం..

కామారెడ్డి నుంచి ప్రజాశాంతి పార్టీ చీఫ్​ కేఏ పాల్​కూడా పోటీకి సై అంటున్నారు. మాస్టర్​ ప్లాన్ ​బాధిత రైతులు కేసీఆర్ పై వంద నామినేషన్లు​ వేస్తామని ఇటీవల ప్రకటించారు. మూడు రోజుల కింద అడ్లూర్​ఎల్లారెడ్డిలో బాధిత రైతులతో సమావేశమైన పాల్​ వచ్చారు. వంద మంది కాకుండా రైతులంతా కలిసి ఒకరిని మాత్రమే బరిలో నిలపాలని కోరారు.

తమ తరఫున పోటీ చేయాలని పాల్​ను కొందరు రైతులు కోరాగా, రైతులతో మరో సారి సమావేశమై నిర్ణయాన్ని వెల్లడిస్తానని ​ప్రకటించారు. శనివారం మాస్టర్​ప్లాన్​ బాధిత రైతు ఐక్య కార్యచరణ కమిటీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్​ను కలిశారు. ఈ పరిస్థితుల్లో వారి నిర్ణయం ఎలా ఉంటుందనేది తేలియాల్సి ఉంది. 

డిమాండ్ల సాధన కోసం..

రాజకీయ పార్టీలే కాకుండా వివిధ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న వారు సైతం ఇక్కడి నుంచి బరిలో నిలుస్తామని ప్రకటించారు. లబాన్​(కాయితీ) లంబాడీలు, గల్ఫ్​బాధిత సంఘం ప్రతినిధులు, స్థానిక ఫౌల్ట్రీ రైతు ప్రతినిధులు కూడా బరిలో ఉంటామని స్పష్టం చేశారు.