కామారెడ్డి జిల్లాలో టెన్త్ స్టూడెంట్లకు స్పెషల్ క్లాసులు..వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ

కామారెడ్డి జిల్లాలో టెన్త్ స్టూడెంట్లకు స్పెషల్ క్లాసులు..వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ
  • ప్రభుత్వ స్కూళ్లపై కలెక్టర్ ఫోకస్​
  • 3 కేటగిరీలుగా విద్యార్థుల విభజన 

కామారెడ్డి​, వెలుగు : పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కామారెడ్డి జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ప్రతి విద్యార్థి పాస్​ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూళ్లపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. 

తరచూ ప్రభుత్వ స్కూల్స్​ను విజిట్ చేస్తున్నారు. పదో తరగతి గదిలో సబ్జెక్ట్​లకు సంబంధించిన విషయాలపై విద్యార్థులను ప్రశ్నలు అడుగుతూ వారి నుంచి జవాబులు రాబడుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు కలిపి మొత్తం 13, 617 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో జడ్పీ హైస్కూళ్లలో 7,532 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. 

ప్రత్యేక కార్యాచరణ..

టెస్త్ క్లాస్ స్టూడెంట్స్​పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అందుకనుగుణంగా చేపట్టాల్సిన కార్యాచరణపై ఆయా స్కూల్స్ హెడ్మాస్టర్లు, టీచర్లు, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. టెన్త్​ క్లాస్ సిలబస్ –2 ‌‌‌‌‌‌‌‌జనవరి 10 వరకు కంప్లీట్ చేసి, సబ్జెక్ట్​లను రివిజన్ చేయనున్నారు. ఈనెల 6 నుంచి  ప్రతి స్కూల్ లో సాయంత్రం గంటపాటు స్పెషల్ క్లాస్​లు ప్రారంభించారు. జనవరి నుంచి ఉదయం, సాయంత్రం స్పెషల్ క్లాస్​లు కొనసాగనున్నాయి. 

రోజుకో సబ్జెక్ట్ టీచర్ స్పెషల్ క్లాస్​లో విద్యార్థులను చదివిస్తారు. సబ్జెక్ట్​లో ఏమైనా సందేహాలుంటే వెంటనే నివృత్తి చేస్తారు. క్లాస్​లో నిర్వహించే ఎగ్జామ్స్​లో విద్యార్థులకు వచ్చే మార్కుల ఆధారంగా 3 కేటగిరీలుగా విభజిస్తారు. సీ–గ్రేడ్​లో ఉన్న విద్యార్థులపై స్పెషల్​గా ఫోకస్​పెట్టి అందరూ ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయనున్నారు. ఏ సబ్జెక్ట్​లో విద్యార్థి వెనుకబడి ఉంటాడో ఆ సబ్జెక్ట్ వారికి సులభంగా అర్థమయ్యేలా చెప్పేందుకు టీచర్లు కృషి చేస్తారు. ఇప్పటికే ప్రభుత్వం అభ్యాసన దీపికలు పంపిణీ చేసింది. ఆయా సబ్జెక్ట్​లను స్టూడెంట్స్ సులభంగా అర్థం చేసుకునేలా అభ్యాసన దీపికల్లో వివరించారు.  

స్పెషల్​ క్లాస్​లు ప్రారంభం

గవర్నమెంట్ స్కూల్స్​లో ఇప్పటికే స్పెషల్ క్లాస్​లు ప్రారంభించాం. సబ్జెక్టులవారీగా వెనుకబడి విద్యార్థులను మరింత ముందుకు తీసుకెళ్లాలని టీచర్లకు సూచించాం. కలెక్టర్ ఆదేశాలతో వచ్చే ఏడాది జరిగే ఎస్సెస్సీ ఎగ్జామ్​లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలనే కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. - రాజు, డీఈవో