కామారెడ్డి ప్రజలు ఓవర్‌‌ కాన్ఫిడెన్స్‌‌తోనే వరదల్లో చిక్కుకున్నరు..వరద ముప్పునకు అక్రమ నిర్మాణాలు కూడా కారణం : ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

కామారెడ్డి ప్రజలు  ఓవర్‌‌ కాన్ఫిడెన్స్‌‌తోనే వరదల్లో చిక్కుకున్నరు..వరద ముప్పునకు అక్రమ నిర్మాణాలు కూడా కారణం : ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
  • వరద తక్కువగా ఉన్నప్పుడే బయటకొస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు
  • కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

కామారెడ్డి, వెలుగు : ‘ప్రజలు ఓవర్‌‌ కాన్ఫిడెన్స్‌‌ కారణంగానే వరదల్లో చిక్కుకున్నారు, తక్కువ వరద ఉన్నప్పుడే ఇండ్లలోంచి బయటకు వచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు’ అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ... ఇండ్లలోకి ఒకేసారి భారీ స్థాయిలో వరద రాలేదని, క్రమక్రమంగా తీవ్రత పెరిగిందన్నారు. విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. 

ఆఫీసర్లు, ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ కొందరు వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు పోస్ట్‌‌లు పెట్టడం సరికాదన్నారు. జిల్లా ఉన్నతాధికారులతో పాటు అన్ని శాఖల ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో ఉండి పనిచేశారని చెప్పారు. తాను సైతం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించానని, ఫొటోలకు ఫోజులు ఇవ్వకుండా ప్రజల కోసం పనిచేశామన్నారు. 

జిల్లా కేంద్రంలో వరద ముప్పుకు ఆక్రమణలు కూడా ఓ కారణమన్నారు. బఫర్‌‌ జోన్‌‌తో పాటు నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్నారు. దసరా తర్వాత సర్వే చేపట్టి ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి, నిర్మాణాలను కూలగొడతామన్నారు.