కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన రద్దు చేస్తాం : కేటీఆర్

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన రద్దు చేస్తాం : కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ను కామారెడ్డి రైతు జేఏసీ బృందం కలిసింది. ఈ సందర్భంగా రైతులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేస్తున్నట్లు ఈ సందర్భగా కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. ఇప్పటికే రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని.. మాస్టర్ ప్లాన్ ని రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ తెలిపిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. మరోసారి డీటీసీపీ అధికారులతో మాట్లాడిన కేటీఆర్... ప్రస్తుతం అమలులో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు. 

రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తాము అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రద్దుకు సంబంధించి మునిసిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు తెలిపిన కేటీఆర్ కి రైతు జేఏసీ ధన్యవాదాలు తెలిపింది. మంత్రి కేటీఆర్ హామీపై పూర్తి భరోసా ఉందని రైతు జేఏసీ నాయకులు తెలిపారు. రైతు జేఏసీ నిరసన కార్యక్రమాల సందర్భంగా నమోదైన కేసులను కూడా సానుకూలంగా పరిశీలించి.. ఎత్తేసే చర్యలు తీసుకుంటామని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. కేసుల వివరాల గురించి జిల్లా ఎస్పీ నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ అంశంపై రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ తో కూడా మాట్లాడారు.