
- జనరల్‌కు కేటాయించిన కామారెడ్డి జడ్పీ చైర్మన్
- బలమైన అభ్యర్థుల కోసం పార్టీల అన్వేషణ
- అధికార పార్టీలో పోటీ పడుతున్న ముఖ్యనేతలు
- సొంత మండలాలు రిజర్వు కావటంతో పక్క మండలాలకు వెళ్లేందుకు రెడీ
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జడ్పీ పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీగా వ్యూహ రచనలు చేస్తున్నాయి. ఈసారి జనరల్ కేటగిరీకి రిజర్వ్ కావడంతో చైర్మన్ కుర్చీ దక్కించుకునేందుకు ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. పార్టీల అధిష్టానాలు మాత్రం బలమైన అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. జిల్లాలో మెజార్టీ జడ్పీటీసీ స్థానాలు గెలిచి జడ్పీని తమ ఖాతాలో వేసుకోవాలని అధికార కాంగ్రెస్ పట్టుదలగా ఉంది.
గతంలో తమ ఆధీనంలో ఉన్న జడ్పీ చైర్మన్ పదవిని మళ్లీ సొంతం చేసుకోవాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ రెండు పార్టీలను ఎదుర్కొని జడ్పీలో తన బలాన్ని చాటుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. మెజార్టీ జడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. కొందరు నేతలకు తమ మండలాల్లో రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో పక్క మండలాల వైపు చూస్తున్నారు.
జిల్లాలో 25 జడ్పీటీసీ స్థానాల్లో 8 జనరల్, 11 బీసీ, 4 ఎస్సీ, 2 ఎస్టీ రిజర్వు అయ్యాయి. గత ఎన్నికల్లో బీసీ మహిళకు కేటాయించగా, ఈసారి జనరల్ కేటగిరీకి రిజర్వు కావడంతో కీలక నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
జనరల్ రిజర్వు స్థానాలు ఇలా..
బిచ్కుంద, బీర్కుర్, నస్రుల్లాబాద్, తాడ్వాయి జనరల్ కాగా, దోమకొండ, పిట్లం, సదాశివనగర్, ఎల్లారెడ్డి జనరల్ మహిళ రిజర్వ్ అయ్యాయి.
బీఆర్‌ఎస్ వ్యూహరచన..
మెజార్టీ జడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించి మళ్లీ జడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని బీఆర్‌ఎస్ కసరత్తు చేస్తోంది. గతంలో జడ్పీ చైర్మన్ పదవి బీఆర్‌ఎస్ దక్కించుకోగా, ఆ విజయాన్ని పునరావృతం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు ప్లాన్ రూపొందిస్తోంది. ఇక గతంలో పార్టీని వీడి ఇతర పార్టీలకు వెళ్లిన నాయకులను తిరిగి పార్టీలో చేర్చుకుని బలాన్ని పెంచే ప్రయత్నాలు మొదలు పెట్టింది. స్థానిక లీడర్లను ఏకతాటిపైకి తెచ్చి జడ్పీలో గులాబీ జెండా ఎగరవేయాలన్న జోష్‌లో బీఆర్ఎస్ ఉంది.
బీజేపీ సన్నాహాలు వేగం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి ఎమ్మెల్యే స్థానాన్ని సాధించి, జిల్లాలో ఓటు శాతం పెంచుకున్న బీజేపీ, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించేందుకు యత్నిస్తోంది. అత్యధిక జడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామస్థాయిలో నాయకులను పోటీలో దింపే వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. స్థానిక నాయకులు, కార్యకర్తల ద్వారా గ్రామాల వారీగా బలమైన అభ్యర్థుల వివరాలు సేకరిస్తోంది. ఈ దిశగా పార్టీ జిల్లాస్థాయి ప్రధాన నాయకుల సమావేశం కూడా తాజాగా నిర్వహించి, చర్చలు జరిపింది.
అధికార పార్టీలో పోటీ
కామారెడ్డి జడ్పీ చైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి రిజర్వ్ కావడంతో అధికార కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. గతంలో బీసీ మహిళకు రిజర్వ్ కాగా, బీఆర్‌ఎస్ నాయకురాలు నిజాంసాగర్ జడ్పీటీసీ దఫేదార్ శోభ చైర్మన్‌గా పనిచేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ జడ్పీలో ఆధిపత్యం సాధించేందుకు వ్యూహరచన చేస్తోంది. మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి చైర్మన్ కుర్చీ దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఉత్సాహం చూపుతున్నారు. పార్టీ అధికారంలో ఉండటంతో ప్రభుత్వ పథకాల అనుకూలతతో జడ్పీటీసీ స్థానాల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి భార్య ఏనుగు మంజులారెడ్డి పేరు చైర్మన్ అభ్యర్థి అన్న చర్చలు వినిపిస్తున్నాయి. అదిష్టానం హామీ ఇస్తే ఆమెను జడ్పీటీసీగా పోటీ చేయించేందుకు రవీందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆమె ఏ మండలం నుంచి పోటీ చేస్తారనే విషయం ఇంకా ఖరారు కాలేదు. మరో జిల్లాస్థాయి కాంగ్రెస్ నేత చైర్మన్ పదవిపై కన్నేశారు. కానీ తన మండలంలో రిజర్వేషన్ అనుకూలంగా లేకపోవడంతో పక్క నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాలకు చెందిన కొందరు నేతలు కూడా జడ్పీ పీఠంపై దృష్టి సారించారు. అభ్యర్థుల ఎంపికపై పార్టీ ప్రధాన నేతలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సమాలోచనలు కొనసాగిస్తున్నారు.