ధోనీని చూసి ఊరుకున్నా.. లేదంటే పరిస్థితి మరోలా ఉండేది: పాక్ క్రికెటర్

ధోనీని చూసి ఊరుకున్నా.. లేదంటే పరిస్థితి మరోలా ఉండేది: పాక్ క్రికెటర్

భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే.. ఇరు దేశాలలో ఎలాంటి వాతావరణం ఉంటుందో ఊహించదగ్గదే. ప్రపంచ కప్ గెలవకపోయినా.. పర్లేదు కానీ, ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం అభిమానులు ఏమాత్రం సహించరు. విజయం సాధించిన దేశంలో బాణాసంచా వెలుగులు మిరిమిట్లు గొలుపుతుంటే..  ఓడిన దేశంలో ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. 

అయితే కొన్ని సందర్భాల్లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. అలాంటి ఘటన 2012/13 సీజన్‌లో బెంగళూరు వేదికగా జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఆ మ్యాచ్‌లో భారత పేసర్ ఇషాంత్ శర్మ , పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. అప్పుడు కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీతోపాటు సురేశ్‌ రైనా కలగజేసుకోవడంతో వివాదం అక్కడితో సద్దుముగిసింది. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అక్మల్ ప్రస్తావించారు.

నేను బూతులు 20 తిట్టాను

"మ్యాచ్‌లో అసహనానికి గురవడం కామన్. కానీ దాన్ని ఇతరులపై చూపించకూడదు. ఇషాంత్ నన్ను దుర్భాషలాడాడు. ఒక అసభ్య పదం వాడాడు. తిరిగి నా చేత 20 పదాలు అనిపించుకోవాల్సి వచ్చింది." 

"బెంగళూరు మ్యాచ్ ముగిశాక..మరో మ్యాచ్ కోసం తర్వాతి రోజు అహ్మదాబాద్‌ వెళ్లాం. ఆ సమయంలో నాతో పాటు విరాట్, షోయబ్ మాలిక్, హఫీజ్‌ కూర్చొని ఉన్నాం. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అని వారిలో ఎవరో అడిగారు. ఇషాంత్‌ బౌలింగ్‌ చేసిన తర్వాత ఏదో అన్నాడు. నేను కూడా ఓ అసభ్య పదం వాడానని చెప్పా. అయితే ఎంఎస్ ధోనీ, సురేశ్‌ రైనా వచ్చి సర్ది చెప్పారు. తప్పు ఎవరిది అని వారికి తెలుసు, కాబట్టి వారు పరిస్థితిని పరిష్కరించారు.. లేదంటే పరిస్థితి మరోలా ఉండేది.." అని అక్మల్ తెలిపాడు.  

ఈ మ్యాచ్‌లో అసభ్య పదాలు వాడటం వల్ల అక్మల్.. రెండు మ్యాచ్‌ల నిషేధంతోపాటు భారీగా జరిమానా కూడా ఎదుర్కొన్నాడు.