నా సోదరి జీవితాన్ని యోగ మార్చింది

నా సోదరి జీవితాన్ని యోగ మార్చింది
  • ఎంగేజ్ మెంట్ జరిగి పెళ్లి చేసుకోబోతున్న నా చెల్లిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి చేశాడు
  • నా చెల్లి రంగోలికి 53 సర్జరీలు జరిగాయి.. కోలుకోవడానికి చాలా కాలం పట్టింది
  • యోగా శిక్షణకు నాతోపాటు తీసుకెళ్లడం ఆమె జీవితాన్ని మార్చేసింది

ముంబయి: యోగా ఎంత మహత్తరమైనదో స్వీయానుభావంతో తెలిసొచ్చిందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వెల్లడించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా సోమవారం తన సోదరికి జరిగిన ప్రమాదం గురించి.. అందులో నుంచి ఆమె ఎలా బయటపడిందో నెటిజనులతో పంచుకున్నారు. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఘటన బంధు మిత్రులు, కొంతమంది సన్నిహితులకు మాత్రమే తెలిసిన ఘటనను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది. తన చెల్లి రంగోలిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి చేశాడని వెల్లడించింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించడంతో ప్రాణాపాయం తప్పినా.. 53 సర్జరీలు జరిగాయని.. మొహం అంతా మారిపోయిందన్నారు. కంటి చూపు వరకు కొంత బాగైందని వెల్లడించింది. నా చెల్లి రంగోలి 21 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రేమిస్తున్నానంటూ వెంటపడిన యువకుడు.. ఉన్మాదిలా ప్రవర్తించాడని వెల్లడించింది. ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న యువకుడితో ఎంగేజ్ మెంట్ కూడా జరిగిందని.. త్వరలో పెళ్లిపీటలెక్కుతుందనగా.. ఉన్మాది యాసిడ్ దాడి చేయడంతో కుంగిపోయిందన్నారు. ప్రాణాపాయం తప్పినా.. తన ముఖం తానే గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో డిప్రెషన్ కు లోనైందని.. చాలా మంది డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లి చూపించినా.. మందులు వాడినా ఏమాత్రం మార్పు రాలేదన్నారు. ఎంగేజ్ మెంట్ జరిగిన యువకుడు కూడా ఈమె పరిస్థితి చూసి వదిలేసి వెళ్లడంతో ఎవరితోనూ మాట్లాడకుండా చాలా రోజులు మౌనంగా ఉండేదన్నారు. అయితే అనుకోకుండా ఒకసారి తాను యోగా క్లాసులకు తీసుకెళ్లగా.. అక్కడి వాతావరణం చూసి చాలా మారిపోయిందని.. ఆ ప్రశాంత వాతావరణంలో యోగా చేయడాన్ని ఆమె ఆస్వాదించి తాను కూడా యోగా చేయడం ప్రారంభించిందన్నారు. ఆమె యోగా చేయడం ప్రారంభించిన తర్వాతే తనతోపాటు అందరితోనూ మాట్లాడడం ప్రారంభించిందని.. తిరిగి ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లయిందని కంగన వివరించింది.