
- రైతులను అవమానించినందుకే కొట్టానన్న కుల్వీందర్ కౌర్
- ఆమెను సస్పెండ్ చేసి, విచారిస్తున్న అధికారులు
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు చేదు అనుభవం ఎదురైంది. సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కంగన చెంప చెల్లుమనిపించింది. గురువారం చండీగఢ్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నుంచి ఎంపీగా గెలిచిన కంగన ఢిల్లీకి వెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కంగనపై దాడి చేసిన కానిస్టేబుల్ ను కుల్వీందర్ కౌర్ గా గుర్తించారు. ఈ ఘటనపై కంగన సహాయకురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.
సీఐఎస్ఎఫ్ అధికారులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి మహిళా కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. ఆమెను విచారిస్తున్నారు. అయితే, రైతుల ఆందోళనలపై గతంలో కంగన చేసిన వ్యాఖ్యలతో తాను తీవ్ర మనస్తాపం చెందానని కుల్వీందర్ చెప్పింది. రైతు నిరసనల్లో తన తల్లి కూడా పాల్గొందని, అందుకేకంగన రనౌత్ పై దాడికి పాల్పడినట్టు వెల్లడించింది. కొన్ని రోజుల క్రితం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు కూడా కంగన కాన్వాయ్‌ను రైతులు అడ్డుకున్నారు. కాగా, ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత ఈ ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు కంగన నిరాకరించారు. పంజాబ్ లో టెర్రరిజం పెరిగిపోతోందని ఆమె మండిపడ్డారు.