ఎవరెంతో వారికంత సృష్టికర్త కాన్షీరామ్

ఎవరెంతో వారికంత సృష్టికర్త కాన్షీరామ్

‘ఓటు హమారా– రాజ్‌‌ తుమారా, నహీ చలేగా.. నహీ చలేగా ’ (ఓట్లు మావి–రాజ్యం మీది, ఇకపై చెల్లదు, ఇకపై చెల్లదు), జిస్కి జితినీ సంఖ్యా భారి, ఉన్కి ఉత్ని ఇస్సేదారి (ఎవరెంతో వారికంత) వంటి నినాదాలతో దేశ రాజకీయాల్లో ప్రకంపలను సృష్టించిన వీరుడు మాన్యవార్ కాన్షీరామ్​. డిఆర్డీఓలో  శాస్త్రవేత్తగా జీవితాన్ని ఆరంభించిన కాన్షీరామ్​ 31వ ఏట అంబేద్కర్ రాసిన ‘కుల నిర్మూలన’ గ్రంథం చదివి ప్రేరేపితుడయ్యాడు.

దేశ స్వాతంత్ర్యం అనంతరం రాజ్యాంగం అమల్లోకి వచ్చాక అటు దేశంలో, ఇటు రాష్ట్రాల్లోనూ అగ్రకుల ఆధిపత్య రైటిస్ట్, లెఫ్టిస్ట్ పార్టీలే అధికారంలో ఉండేవి. 1975 ఎమర్జెన్సీ తరువాత కూడా ఆ పార్టీలే అధికారంలోకి రావడం గమనార్హం. వీటికి అభిముఖంగా కాన్షీరామ్​ బహుజన ఉద్యమం బయలుదేరింది.  ములాయం సింగ్ యాదవ్ 1992 ముందు జనతాదళ్(సోషలిస్ట్) నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు.  కాన్షీరామ్​  ఆ పార్టీ నుంచి బయటికి రప్పించి ఆయనతో  సొంతంగా రాజకీయ పార్టీని పెట్టించాడు. 1993లో ఆ పార్టీ పొత్తుతో యూపీలో బహుజన రాజ్యాధికారం చేజిక్కించ్చుకున్నాడు.  

కాన్షీరామ్​ తన తల్లికి ఉత్తరం రాసి కుటుంబ బాంధవ్యాలను తెంచుకొని ఇంటిని వదిలివెళ్ళాడు. ఈ దేశంలో అట్టడుగు వర్గాల విముక్తికి ఉద్యమాలు సాగించిన ఫూలే, సాహు మహరాజ్, పెరియార్, నారాయణ గురు, అంబేద్కర్‌‌ లకు ప్రతిరూపంగా నిలిచాడు.  బహుజన  కులాలను ఏకం చేసేందుకు బామ్ సేఫ్,  డీఎస్-4 వంటి సంస్థలను ఏర్పాటు చేసి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ చైతన్య భేరి మోగించాడు. 1984 ఏప్రిల్ 14న బహుజన సమాజ్ పార్టీని స్థాపించాడు. ఇది 1996 నాటికి జాతీయపార్టీగా ఎదిగి బహుజన రాజ్యానికి దిక్సూచిగా నిలిచింది.  కాన్షీరామ్​ అవిశ్రాంత రాజకీయ పోరాటం 2006  అక్టోబర్​ 9న ఆగిపోయినది. కాన్షీరామ్​ మన నుంచి దూరమై రెండు దశాబ్దాలు కావస్తున్నా ఆయన స్వరాజ్య పోరాటం నేటికి కొనసాగుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల కులగణన, రిజర్వేషన్లు పెంపు వంటి సామాజిక న్యాయ డిమాండ్లు ఇందుకు నిదర్శనం.

రాజకీయాల్లో సరికొత్త విప్లవం
కులాన్ని నిర్మూలిద్దాం -బహుజన రాజ్యాన్ని నిర్మిద్దాం అంటూ దేశవ్యాప్తంగా తనదైన శైలిలో కాన్షీరామ్​ రాజకీయ ఉద్యమం సాగించాడు.  నువ్వు 85 శాతం ఉండగా 15 శాతం మీద ఎందుకు ఆధారపడతావు? అని ప్రశ్నించాడు.    ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి,  ప్రజల భూమి మీద ప్రజలకు హక్కులేదా? అంటూ అగ్రకుల పాలకులపై ప్రశ్నల వర్షం కురిపించాడు. అనాడు మండల్ కమిషన్ (1980) ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది.  వీటి అమలుకు  ఢిల్లీ బోట్స్ క్లబ్ ముందు  ధర్నాతో  విప్లవానికి కారణమయ్యాడు.

‘విప్లవం అంటే రేషన్ కార్డు, పెన్షన్ కోసం వంటి సంక్షేమ పథకాల కోసం ఉద్యమాలు, ధర్నాలు చేయడం కాదు. రాజ్యాధికారం మారి అగ్రకులాలు మాకు న్యాయం కావాలని రోడ్లపైకి రావడమే విప్లవం అన్నాడు.   కాన్షీరామ్​ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో  రాజ్యాధికారం కోసం విశ్వప్రయత్నం చేశాడు. ఇప్పుడు తెలంగాణలో కాన్షీరామ్​ ఉద్యమానికి కొనసాగింపుగా బీసీ, ఎస్సీ, ఎస్టీల ఐక్య కార్యాచరణ సమితి (జాక్) ఆవిర్భవించింది.  అది భారత రాజ్యాంగ బలంతో 
రాజ్యాధికారం వైపు నడవాలి. అప్పుడే సామాజిక న్యాయం సాకారమవుతుంది.

కులాల కేంద్రంగా రాజకీయాలు
‘కాన్షీరామ్​ కులాన్ని రాజకీయ అస్త్రంగా వాడిన రాజనీతిజ్ఞుడు.  కులం పునాదుల మీద ఒక జాతిని కానీ, ఒక నీతిని కానీ నిర్మించలేమని’ ఆనాడు అంబేద్కర్ పేర్కొన్నారు. ఆధిపత్య కుల పునాదుల మీద జాతీయవాదాన్ని నిర్మించాలన్న అగ్రకులాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య చేశాడు.  దీనిలోని తాత్వికతను అర్థం చేసుకున్న ఆయన  ‘కులాన్ని రెండంచుల కత్తి’గా పేర్కొంటూ కులాల కేంద్ర బిందువుగానే రాజ్యాధికారాన్ని సాధించాడు. మినీ ఇండియాలాంటి ఉత్తరప్రదేశ్​కు  ఒక దళిత మహిళైన మాయావతిని  నాలుగుసార్లు ముఖ్యమంత్రి పీఠంపై  కూర్చోబెట్టాడు.  భారతదేశ రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలికాడు. ఆయన  బహుజనోద్యమం పంజాబ్, రాజస్తాన్, కర్నాటక, హర్యానా, ఢిల్లీ, కాశ్మీర్, బిహార్, మధ్యప్రదేశ్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రభావం చూపింది.

సంపతి రమేష్ మహారాజ్, సోషల్ ఎనలిస్ట్