
‘భూతకోల’ నృత్య నేపథ్యంలో తెరకెక్కి, ఇటీవలే విడుదలైన ‘కాంతార’ చిత్రం దేశవ్యాప్తంగా అద్భుత విజయం సాధిస్తోంది. ఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రామీణ సంప్రదాయ దైవారాధనలు, ఉత్సవాలు, ఊరేగింపుల్లో నృత్యాలు చేసే దైవ నర్తకులకు ప్రతి నెలా రూ.2వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి సునీల్‌కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ మధ్య రిలీజైన ‘కాంతార’ సినిమా స్ఫూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్న విలేకరులు ప్రశ్నకు... తీసుకుంటే తప్పేంటని ఆయన బదులిచ్చారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 60 ఏళ్లు దాటిన నృత్యకారులకు ఆర్థిక సాయం అందనుంది. దీనిపై భాజపా ఎంపీ పి.సి.మోహన్ ట్వీట్ చేస్తూ భూతకోల నృత్యం హిందూ ధర్మంలోని దైవారాధనలో భాగమని అన్నారు. హిందూ సంస్కృతిని పరిరక్షించే దిశగా భాజపా ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
ఇప్పటికే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం.. మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని తెచ్చేలా తీర్మానించింది. గవర్నర్ ఆమోదం కోసం ఈ బిల్లును పంపుతున్నట్లు ప్రకటించింది. న్యాయపరమైన అడ్డంకుల కారణంగా ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.