Ugadi Rasi Phalalu 2023 - Kanya Rashi : కన్య రాశి ఫలితాలు

Ugadi Rasi Phalalu 2023 - Kanya Rashi : కన్య రాశి ఫలితాలు

గురువు 22.03.2023 నుంచి 21.04.2023 సప్తమంలో తదుపరి ఉగాది వరకు అష్టమంలో సంచారం. శని 22.03.2023 నుంచి 08.04.2023 వరకు స్వస్తానమందు తామ్రమూర్తిగా సంచారం.రాహువు 22.03.2023 నుంచి 30.10.2023 అష్టమంలో, తదుపరి ద్వితీయంలో రజిత మూర్తిగా  ఉగాది వరకు సంచారం. కేతువు 30.10.2023 నుంచి 08.04.2024 జన్మస్థానంలో సంచారం. ఈ సమయంలో చాలా  కలుపుగోలుతనంగా ఉండాలి. 

ఈ రాశి స్త్రీ పురుషులకు ఆకస్మిక ధన వ్యయం. నిల్వ ఉన్న ధనమంతా ఖర్చు చేస్తారు. స్థిరాస్తుల వైపు మనసు మొగ్గు చూపుతుంది. గురు పూజలు చేయడం వల్ల విద్య యందు శ్రద్ధ చూపుతారు. శని అష్టమ స్థానంలో ఉన్నందు వల్ల స్థిరాస్తుల వృద్ధి. రైతులు వ్యవసాయ ముహుర్తంలో భూమి దున్నాలి. లాయర్లు, డాక్టర్లకు అనుకూలం. వృత్తి వ్యాపారులకు సామాన్యం. కాంట్రాక్టర్లు జాగ్రత్తగా టెండర్‌‌ వేయండి. ముక్కుసూటిగా ఉన్న వారు రాజకీయంలో అష్టకష్టాలు అనుభవిస్తారు. చిన్న, పెద్ద పరిశ్రమల వారికి కొన్ని సమస్యలు. వాస్తు ప్రకారం ఇండ్లు, ఫ్యాక్టరీలు నిర్మాణం చేసిన వారికి అనుకూలం. వెండి, బంగారం, వస్త్ర వ్యాపారులకు ఇబ్బందికరం. జాయింట్‌ వ్యాపారులకు సమస్యలు. చిన్నా చితక ఫైనాన్స్‌, షేర్లు, చిట్స్‌, పౌల్ట్రీ వారికి సమస్యలు ఎక్కువ. న్యాయస్థానాల్లో కొన్ని సమస్యలు. ప్రధానంగా అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు. కాబట్టి, గురు బలం లేకపోతే నరాలకు సంబంధించి వ్యాధులు రాగలవు. అజీర్ణం వల్ల ఇబ్బందులు. దొంగల భయం, అగ్ని సంబంధమైన సమస్యలు. ఈ సంవత్సరమంతా గ్రహాల కలయిక సరిగా లేక అనేక విషయాల్లో సమస్యలు. ఉత్తర నక్షత్రం వారు జాతి కెంపు ధరించాలి. ఆదిత్య హృదయ పారాయణ, సూర్య నమస్కారాలు12 సార్లు చేయాలి. హస్త నక్షత్రం వారు ముత్యం ధరించాలి. దుర్గాదేవి పారాయణం, పూజలు తప్పనిసరి. చిత్తా నక్షత్రం వారు పగడం ధరించాలి. స్కందగిరిలో శ్రీసుబ్రమణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం, జపం చేయాలి. మహాన్యాస రుద్రాభిషేకం చేస్తే మంచిది. కాల భైరవ దర్శనం, పూజలు, రాహు, కేతువుల, గురు పూజలు, వెంకటేశ్వర స్వామి అలంకారం చేస్తే కొంత ఊరట. శకునం చూసి బయటకు వెళ్లాలి. యోగా, ప్రాణాయామం, ధ్యానం తో ఆరోగ్యం. తల్లిదండ్రుల ప్రేమ, పితృదేవతల ఆరాధన వల్ల కొన్ని సమస్యలు అదుపులో ఉంటాయి. అదృష్ట సంఖ్య6.

కన్య రాశి మాస ఫలితాలు

చైత్ర మాసం: మీరు మాట్లాడే ప్రతి మాట అవతలివారికి తప్పుగా అర్థం అవుతుంది. భార్యాభర్తల మధ్య అగాధం రాకుండా జాగ్రత్తలు పాటించాలి. నిరంతరం ఏదో తెలియని ఒత్తిడి. నవ గ్రహ ప్రదక్షిణలు శివారాధన, అమ్మవారి నామం జపించండి. 

వైశాఖ మాసం: ఆకస్మిక ధన వ్యయం. స్థిరాస్తులు కొనడం వాయిదా వేయాలి. నిల్వ ఉన్న డబ్బు ఖర్చు అవుతుంది. అనవసర ఖర్చులు, విందు వినోదాలు  వాయిదా వేయండి. తొందరపాటు నిర్ణయాల వలన కష్టాలు. దైవారాధన అవసరం. 

జ్యేష్ఠ మాసం: గ్రహ సంచారం అనుకూలంగా లేదు. ఏం మాట్లాడినా ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆగిపోతుంది. విద్యార్థులు పట్టుదలతో చదివితే పాస్‌ అవుతారు. సరస్వతీ దేవి పూజలు, సత్యనారాయణ వ్రతం చేయాలి. 

ఆషాఢ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు ప్రతి విషయంలో చికాకులతో పాటు మనోభీతి ఉంటుంది. ప్రయాణంలో ప్రమాదాలు జరిగే అవకాశం.తొందర పాటు మంచిది కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. దుర్గాదేవి సప్తస్తుతి చేయండి. 

అధిక శ్రావణ మాసం: గ్రహ కలయిక సరిగా లేదు. సూర్య ఆరాధన, సుబ్రమణ్యేశ్వర స్వామి పారాయణం చేయండి. శ్రీసూర్యాయ నమః అనే పారాయణంతో కొంత శాంతి. అవకాశం ఉంటే అభిషేకం చేయించాలి. నిరంతరం దైవ నామ జపం చేయండి.

నిజ శ్రావణ మాసం: కొంతవరకు గ్రహ కలయిక ఉంది. ఆర్థిక విషయాల్లో శ్రద్ధ అవసరం. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు. దురలవాట్లకు బానిస కావద్దు. జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రతి రోజు నవగ్రహ ప్రదక్షిణలు తప్పనిసరి. 

భాద్రపద మాసం: సామాన్యం. విఘ్నేశ్వర ఆరాధనతో ఈ నెల గడిచిపోతుంది. నిరంతరం దైవ నామస్మరణ చేయాలి. రోజూవారి జీవితంలో అనేక సమస్యలు. వీటిని పట్టించుకోరాదు. లక్ష్మీ విఘ్నేశ్వర హోమం చేయించండి. 

ఆశ్వయుజ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా ఉంటుంది. దసరా పండుగ సందర్భంగా దుర్గా మాతను అనునిత్యం పారాయణం చేయండి. ఓం శ్రీమాతేశ్వరాయనమః లేక మీ ఇష్టదైవ నామాన్ని జపించండి. కుసుమ నూనెతో దీపారాధన శాంతినిస్తుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి. 

కార్తీక మాసం: సామాన్యంగా ఉంటుంది. పరమేశ్వరుడిని పూజించడం వలన మీ సమస్యలు అదుపులో ఉంటాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర ఖర్చులకు, సంఘ వ్యవహరాలకు చాలా దూరంగా ఉండండి. కర్త, కర్మ అంతా ఆ పరమేశ్వరుడే అని నమ్మండి. 

మార్గశిర మాసం: భక్తి విశ్వాసాలతో ఉండటం వలన గతం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. నవ గ్రహ ప్రదక్షిణలు చేయండి. వివాదాలకు దూరంగా ఉండండి. గొడవ వస్తే, నోట్లో నీరు పెట్టుకోండి. గ్రహాలను ఆరాధించడం మంచిది. 

పుష్యమాసం: చాలా జాగ్రత్తగా ఉండండి. పని భారం పెరుగుతుంది. ఎదుటివారు చులకనగా చూస్తారు. అలాంటి వారి ముఖం వంక చూడకపోవడమే మంచిది. మానసికంగా ధైర్యంగా ఉండండి. దైవారాధన చేయడం మంచిది. 

మాఘ మాసం: కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఎంత ఒత్తిడిలో ఉన్నా చాలా జాగ్రత్తగా ఉంటారు. సమస్యలు రాకముందే జాగ్రత్తలు తీసుకుంటే కొంత వరకు ఉపశమనం దొరుకుతుంది. విందువినోదాలు, వివాహ శుభకార్యాలకు హాజరు అవుతారు. శ్రీసుబ్రమణ్యేశ్వర స్వామి ఆరాధన, దర్శనంతో శాంతి ఉంటుంది. 

ఫాల్గుణ మాసం: కొంతవరకు మనఃశ్శాంతిగా ఉంటారు. ఉత్సాహంగా కనిపిస్తారు. కార్యసాధనంలో కొంత వరకు శాంతి ఉంటుంది. లౌకిక భావం వల్ల ఇతరులను ఆకర్షించగలరు. ఎక్కడా ఉద్రేకపడొద్దు. నవగ్రహాలు... ప్రత్యేకంగా కుజ ధ్యానంతో ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి.