
రెండు మూడు భాషల ప్రేక్షకుల్ని మెప్పించే నటీనటులు చాలామందే ఉంటారు. కానీ ప్రపంచం మొత్తాన్నీ తన నటనతో ఇంప్రెస్ చేయగలిగే వాళ్లు కొందరే ఉంటారు. అలాంటివారిలో నందితాదాస్ ఒకరు. పదుల సంఖ్యలోనే సినిమాలు చేసినా.. ఇండియన్ మూవీ హిస్టరీలో నిలిచిపోయేవి చేశారామె. తెలుగులో ‘కమ్లి’ అనే సినిమాలోనూ నటించి నంది అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం రానా హీరోగా వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న ‘విరాటపర్వం’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే నటిగానే కాదు.. దర్శకురాలిగానూ నందితది ఓ ప్రత్యేకమైన శైలి. హిందీ, ఉర్దూ, గుజరాతీ భాషల్లో ఆమె తెరకెక్కించిన ‘ఫిరాక్’ మూవీ ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెల్చుకుంది. ‘ఇన్ డిఫెన్స్ ఆఫ్ ఫ్రీడమ్’ షార్ట్ ఫిల్మ్‌తో పాటు ‘మాంటో’ మూవీకి కూడా పలు అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఇప్పుడు మరోసారి మెగాఫోన్ పట్టేందుకు రెడీ అయ్యారు నందిత. హీరోగా మారిన ప్రముఖ స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ ఇందులో లీడ్ రోల్ చేస్తున్నాడు. ఈ నెలాఖరున షూటింగ్ మొదలు కానుంది. నందిత స్వయంగా నిర్మిస్తున్నారు.