
- గతేడాదితో పోలిస్తే తగ్గిన వర్షపాతం
- అడపాదడపా జల్లులు మినహా చెప్పుకోదగ్గ వానలే పడ్తలే
- నీళ్లు లేక ఎండుతున్న పంటలు
కరీంనగర్/జగిత్యాల, వెలుగు: ఈ వానాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సాగు సాగడం లేదు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌లలో నీళ్లు లేక, కాల్వల్లో రాక ఎవుసం పడకేసింది. ఇప్పటికే పత్తి, మక్క, పెసర్లు లాంటి విత్తనాలు పెట్టిన రైతులు పరేషాన్ అవుతున్నారు. మండే ఎండలకు చేన్లు ఎండిపోతున్నాయి. మే నెల చివరిలోనే మురిపించిన వర్షాలు ఆ తర్వాత పత్తా లేకుండా పోయాయి. అడపాదడపా కురిసినా కాల్వలు పారే, చెరువులు, కుంటలు నిండే, భూగర్భ జలాలు పెరిగే స్థాయిలో వర్షం పడలేదు. దీంతో కాల్వల కింద సాగుకు ప్రశ్నార్థకంగా మారింది. బావులు, బోర్ల కింద మాత్రమే వరి, పత్తి సాగుకు రైతులు
ప్రయత్నిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 30 శాతం సాగులోకి..
12 లక్షల ఎకరాల సాగు భూమిలో కేవలం 2.91 లక్షల ఎకరాల్లోనే సాగు పూర్తయింది. కరీంనగర్ జిల్లాలో 3,33,600 ఎకరాల్లో సాగుభూమి ఉండగా ఇప్పటివరకు 75,715 ఎకరాల్లోనే సాగు చేశారు. పెద్దపల్లి జిల్లాలో 2,83,190 ఎకరాలకు 47,328 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 3,86,510 ఎకరాలకు 65,267 ఎకరాలు, సిరిసిల్లలో 2,44,511 ఎకరాలకు 62,551 ఎకరాల్లోనే పంటలు సాగుచేశారు. ఇప్పటివరకు 30 శాతం మాత్రమే సాగులోకి వచ్చిందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్నారు. గతేడాది ఇదే సమయానికి సాగు విస్తీర్ణం అధికంగా ఉండగా, ఈ ఏడాది వానల కురవకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన పంటలైన మొక్కజొన్న, పసుపు, కంది, పత్తి పంటలు వేసిన రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పంటల సాగు మరింత తగ్గే ప్రమాదం ఉందని అధికారులు
హెచ్చరిస్తున్నారు.
గతేడాదితో పోలిస్తే తగ్గిన వర్షపాతం..
ప్రతి ఏటా జూలై మొదటి రెండు వారాల్లో నమోదయ్యే వర్షపాతంతో పోలిస్తే ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో వర్షపాతం గణనీయంగా తగ్గింది. పెద్దపల్లి జిల్లాలో సాధారణ వర్షపాతం 287 మి.మీ. నమోదు కావాల్సి ఉండగా 137 మి.మీల మాత్రమే నమోదైంది. ఈ జిల్లాలో అత్యధికంగా 52 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లాలో సాధారణ వర్షపాతం 284మి.మీ.కు 189 మి.మీ., కరీంనగర్ జిల్లాలో 228 మి.మీ.కుగానూ 152 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ రెండు జిల్లాల్లో - 33 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 227 మి.మీలకు గానూ 158 మి.మీ. (-30 శాతం లోటు) వర్షపాతం నమోదైంది. ప్రధానంగా ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, ఇతర ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనిష్టంగా ఉండటం, చెరువులు, కుంటలు పూర్తిగా నిండకపోవడంతో భూగర్భజలాలు గణనీయంగా పడిపోవడంతో సాగు ఆలస్యమవుతోంది. పంటల సాగు ముమ్మరంగా ప్రారంభమవ్వాలంటే మరో 15–20 రోజుల్లో గణనీయమైన వర్షాలు పడాల్సిన అవసరం ఉందని వ్యవసాయశాఖ నిపుణులు అంటున్నారు.