- కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: యువత, విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేసే మత్తు పదార్థాల మూలాలను పెకిలించి, కరీంనగర్‌ను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన నార్కో కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
డ్రగ్స్ వినియోగంతో కలిగే అనర్థాలపై యువత, విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో విస్తృత తనిఖీలు చేపట్టి మత్తు పదార్థాల రవాణా, అమ్మకాలను అరికట్టాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
స్నేహిత కార్యక్రమం ద్వారా స్కూళ్లల్లో విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. అనంతరం సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ మత్తు పదార్థాల నిర్మూలనకు నిత్యం గస్తీ, తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు సన్మానం
బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బాల్య వివాహాల సమాచారం తెలుసుకుని అడ్డుకునేందుకు చర్యలు తీసుకున్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను మంగళవారం తన చాంబర్‌లో సన్మానించారు.
జమ్మికుంట మండలం పాపక్కపల్లి పంచాయతీ సెక్రటరీ నరేందర్ రెడ్డికి బాల్యవివాహ సమాచారం తెలియగానే సంబంధిత అధికారులకు విషయం చెప్పి అడ్డుకున్నాడు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ నిర్మలకు కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ గ్రామంలో బాల్యవివాహం సమాచారం తెలియగానే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు పెండ్లి ఆగిపోయింది. వారిద్దరిని కలెక్టర్ సన్మానించి, అభినందించారు.
