- జనరల్ ఎన్నికలను తలపించేలా ప్రచారం
- ఓటింగ్ లో పాల్గొన్న 44 శాతం మంది ఓటర్లు
- అర్ధరాత్రి వరకు కొనసాగిన కౌంటింగ్ ప్రక్రియ
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. జనరల్ ఎన్నికలను తలపించేలా అభ్యర్థుల ప్రచారం, పోలింగ్ సరళి సాగింది. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరీంనగర్ కశ్మీర్ గడ్డలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజీతోపాటు, జగిత్యాల జిల్లా కేంద్రంలోని గర్ల్స్ జూనియర్ కాలేజీలో పోలింగ్ ప్రక్రియ సాగింది. అర్బన్ బ్యాంకులో మొత్తం 9,287 మంది ఓటర్లున్నారు. వీరిలో కరీంనగర్ లో 7,272 మంది ఓటర్లకుగానూ 3,342 మంది, జగిత్యాలలో 2015 మంది ఓటర్లకుగానూ 772 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 4,114 మంది ఓటు వేయగా.. 44.26 శాతం పోలింగ్ నమోదైంది. కాగా పలువురు ఓటర్లు ఓటేసేందుకు ఆసక్తి చూపకపోవడం గమనార్హం.
అర్ధరాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ..
జగిత్యాల పోలింగ్ కేంద్రం నుంచి బ్యాలెట్స్ బాక్సులను కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీకి తరలించాక సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ఆఫీసర్లు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. కౌంటింగ్ కోసం 4 టేబుళ్లు వేశారు. 12 డైరెక్టర్ స్థానాలకు మొత్తం 54 మంది పోటీపడుతున్నారు. కేటగిరీలవారీగా వేర్వేరుగా లెక్కించడం ప్రారంభించారు. ముందుగా 50 ఓట్ల చొప్పున ఒక కట్ట కట్టి.. ఆ తర్వాత అందులోంచి చెల్లని ఓట్లను వేరుచేశారు. ఆ తర్వాత చెల్లిన ఓట్లన్నింటిని మళ్లీ 50 ఓట్ల చొప్పున కట్టలుగా కట్టి.. ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్కిస్తున్నారు. అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. 12 మంది డైరెక్టర్లలో చైర్మన్ అభ్యర్థికి మరో ఆరుగురు డైరెక్టర్ల మద్ధతు ఉంటే సరిపోతుంది.
