కరీంనగర్ క్రైం, వెలుగు : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ గౌస్ ఆలం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈనెల 31 రాత్రి ప్రత్యేక ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.
కమిషనరేట్ వ్యాప్తంగా 44 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 31 రాత్రి లోయర్ మానేరు డ్యామ్ కట్ట, తీగల వంతెన పైకి వెళ్లడం, అక్కడ వేడుకలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని తెలిపారు. డీజేల వినియోగంపై నిషేధం ఉందని, ఫిర్యాదులు వస్తే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. బాధితులు వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు.
