- సేకరించిన 24 గంటల్లో ప్రజల దగ్గరికి..
- 16 జిల్లాలకు చెందిన లక్ష మంది పాడి రైతుల సంస్థగా గుర్తింపు
- రాష్ట్రవ్యాప్తంగా విస్తరణకు అడుగులు
- ఇతర రాష్ట్రాల బ్రాండ్లు పుట్టుకొస్తున్నా జనంలో తరగని ఆదరణ
- పాడి రైతుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు
కరీంనగర్ : తెలంగాణ పాడి పరిశ్రమ రంగంలో కరీంనగర్ డెయిరీ తన విజయయాత్రను కొనసాగిస్తోంది. గత ఐదున్నర దశాబ్దాలుగా పాల సేకరణ, అమ్మకాల్లో తనదైన మార్క్ చూపిస్తూ.. రాష్ట్రంలోని ఇతర డెయిరీలకు ఆదర్శంగా నిలుస్తోంది. శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ను ఆదర్శంగా తీసుకొని.. పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. 1971లో కేవలం 12 వేల లీటర్ల పాల సేకరణతో ప్రారంభమైన కరీంనగర్ డెయిరీ.. పాలకవర్గం, సిబ్బంది నిరంతర కృషి ఫలితంగా ప్రస్తుతం రోజుకు 2 లక్షల లీటర్ల పాలు సేకరించే స్థాయికి ఎదిగింది. రానున్న రోజుల్లో ఈ సేకరణను 3 లక్షల లీటర్లకు పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 16 జిల్లాల్లో గల 1,300 గ్రామాల నుంచి ప్రతిరోజూ పాలను సేకరిస్తూ విస్తృతమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. పాలను సేకరించిన కేవలం 24 గంటల్లోనే పూర్తి నాణ్యతా ప్రమాణాలతో వినియోగదారులకు అందజేయడం ఈ డెయిరీ ప్రత్యేకత.
స్వచ్ఛమైన నెయ్యితో కరీంనగర్ డెయిరీ మిక్స్ డ్ స్వీట్లు..
కరీంనగర్ డెయిరీ నుంచి పాలు, పెరుగుతోపాటు ఇతర ఉత్పత్తులు ప్రజల ఆదరణ పొందుతున్నాయి. కరీంనగర్ డెయిరీ బాదం మిల్క్ వివిధ రకాల ఫ్లేవర్లలో లభ్యమవుతోంది. కరీంనగర్ డెయిరీ బ్రాండ్ తో లభించే బటర్ మిల్క్, దూద్ పేడ, మలాయ్ లడ్డూ, మిల్క్ కేక్, ఖర్జూరా కోవాతోపాటు టీతో కలిపి తినే ఉస్మానియా బిస్కట్స్, రస్క్ ల కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ తయారు చేసే బాసుంది, కోవా జామూన్, నెయ్యికి రాష్ట్ర నలుమూలల నుంచి బల్క్ ఆర్డర్లు వస్తున్నాయి. కరీంనగర్ బాసుంది టేస్ట్ ప్రత్యేకం. స్పెషల్ లస్సీ, జీరా బట్టర్ మిల్క్, కోవా జామూన్, పన్నీర్ ను ఉత్పత్తి చేస్తున్నారు. నెయ్యితో తయారు చేసిన కరీంనగర్ డెయిరీ మిక్స్ డ్ స్వీట్స్ పండుగ స్పెషల్ గా అందిస్తున్నారు.
స్వచ్ఛమైన పాలు, పెరుగుకు కేరాఫ్..
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలోని 3 లక్షల లీటర్ల సామర్థ్యంతో అత్యాధునిక సాంకేతికతతో పూర్తిగా ఆటోమేటెడ్ మెగా డెయిరీ ప్రాజెక్ట్ ను రెండేళ్ల క్రితం నెలకొల్పారు. ట్యాంకర్ నుంచి పాలు వచ్చింది మొదలు.. ప్యాకింగ్ వరకు ఎక్కడా మనుషుల ప్రమేయమే ఉండదు. ప్యాకింగ్ అయ్యాక బాక్సులు సర్దడం మినహా మొత్తం ప్రాసెస్ అంతా ఆటోమేషన్ ద్వారానే పూర్తవుతుంది. ప్రతిట్యాంకర్ లో పాలను 16 రకాల టెస్టులు చేసిన తర్వాత అనుమతిస్తున్నారు. టెస్టుల్లో ఫెయిలైతే ట్యాంకర్ పాలైనా రిటర్న్ వెళ్లాల్సిందే. కరీంనగర్ డెయిరీ నుంచి ప్యూర్, టోన్డ్ పాలతో పాటు గోల్డ్ టీ స్పెషల్ పాలు లభిస్తున్నాయి. ప్రతి రోజు లక్షా 20 వేల లీటర్ల పాలు, 80 వేల లీటర్ల పెరుగు అమ్మకాలు జరుగుతున్నాయి. పెరుగు ప్యాకెట్లతో పాటు 1కిలో, 2, 5, 10 కిలోల నుంచి 40 కిలోల వరకు బకెట్ల రూపంలో ఫంక్షన్లకు ఉపయోగపడేలా పెరుగు అందిస్తున్నారు.
ఇక్కడి పాలు కొంటే తెలంగాణ రైతులకే లాభం
సుమారు లక్ష మంది పాడి రైతులకు కరీంనగర్ డెయిరీ ఆర్థిక భరోసా కల్పిస్తోంది. పాల వ్యాపారం.. పాడి రైతుల సంక్షేమం రెండు కండ్లుగా భావించి డెయిరీ పాలకవర్గం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. 50 శాతం సబ్సిడీతో పశువుల వ్యాధి నిరోధక టీకాలు, 75 శాతంతో నట్టల మాత్రలు, 50 శాతం సబ్సిడీతో మేలు రకపు పశుగ్రాస విత్తనాలు, 25 శాతం సబ్సిడీ తో మినరల్ మిక్చర్, 50 శాతం సబ్సిడీపై చాప్ కట్టర్లను అందజేస్తున్నారు. మేలుజాతి పశువుల అభివృ ద్దికి కృత్రిమ గర్భోత్తత్తికి, ఆడ దూడలు జన్మించడం కోసం 50 శాతం నబ్సిడీపై సాల్టెడ్ సెమెన్ సరఫరా చేస్తున్నారు. మేలు జాతి పశువుల కొనుగోలుకు రైతులకు రూ.60 వేల వరకు లోన్, ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తే, 90 శాతం సబ్సిడీ అందిస్తున్నారు. పాడి పశువులు మరణిస్తే సభ్యులకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ఆర్థిక సాయం చేస్తున్నారు.
పాడి భరోసా స్కీంలో భాగంగా పాల ఉత్పత్తిదారు లురూ.250 చెల్లిస్తే పాడి రైతు దంపతుల్లో ఎవరు మరణించినా రూ.50 వేల వరకు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్నారు. పాల ఉత్పత్తిదారుల సంక్షేమ గుర్తింపు కార్డు కలిగి ఉన్న పాడి రైతు మరణిస్తే రూ.5 వేలు, సంస్థ అధ్యక్షు డు మరణిస్తే రూ.7 వేలు అంత్యక్రియలకు ఇస్తున్నా రు. కళ్యాణమస్తు పథకం ద్వారా పెళ్లి సమయంలో రైతు బిడ్డకు పుస్తె, మట్టెలు, పసుపు, కుంకుమ అందజేస్తున్నారు. 18 ఏండ్ల నుంచి 60 ఏండ్ల మధ్య వయసున్న ఉన్న పాడి రైతులకు వృద్ధాప్య సంక్షేమ పథకం అమలు చేస్తున్నారు.
యాప్‌లో ఆర్డర్ చేస్తే ఇంటికే పాలు..
గూగుల్ ప్లే స్టోర్ లో కరీంనగర్ డెయిరీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని అందులో నుంచి ఆర్డర్ చేస్తే అర గంటలో పాలు, పాల ఉత్పత్తులు ఇంటి వద్దకే డెలివరీ చేయనుంది. ప్రస్తుతం కరీంనగర్ సిటీ ప్రజలకు ఈ యాప్ సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే ఈ యాప్ లో కనీసం రూ.200 విలువైన ఐటెమ్స్ ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఎమ్మా రీపై 10 శాతం డిస్కౌంట్ తో పాలు, పాల ఉత్పత్తు లను వినియోగదారుల ఇంటి వద్దకు చేర్చుతామని మార్కెటింగ్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా బల్క్ ఆర్డర్ల కోసం 91777 37070, 98489 38996 నంబర్లకు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.
ప్రజలకు నాణ్యమైన పాలు.. పాడి రైతు సంక్షేమమే లక్ష్యం
రైతుల ప్రయోజనాలను కాపాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన పాలను అందించడమే లక్ష్యంగా కరీంనగర్ డెయిరీ ముందుకు సాగుతుందని డెయిరీ చైర్మన్ డాక్టర్ చలిమెడ రాజేశ్వర్ రావు వెల్లడించారు. నాణ్యతలో రాజీపడకుండా వినియోగదారులకు పాలు, పాల పదార్థాలు అందిస్తున్నామని, పాడి పరిశ్రమను మరింత ప్రోత్సహించేందుకు తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ వద్ద 3 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న డెయిరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శనివారం ఆయన 'వీ6 వెలుగు'తో ప్రత్యేకంగా
మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
'మా డెయిరీ పరిధిలోని రైతులకు అనేక రాయితీలు ఇస్తూ, పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం. గేదె పాలకు లీటర్ కు గరిష్టంగా రూ.91 వరకు ఇస్తున్నాం. పాలల్లో ఫ్యాట్ ను బట్టి లీటర్ కు సగటున రూ.80 వరకు రైతుకు అందుతోంది. ఒకప్పుడు కేవలం 20 వేల లీటర్ల సేకరణ ఉన్నమా డెయిరీ ప్రస్తుతం లక్షన్నర నుంచి రెండు లక్షల లీటర్ల సేకరణ వరకు వచ్చింది. భవిష్యత్ లో మా పాల సేకరణను 5 లక్షల లీటర్ల వరకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వినియోగదారుల ఆదరణ, సిబ్బంది కృషి, పాడి రైతుల సహకారంతో డెయిరీని రాష్ట్రంలో నంబర్ వన్ గా నిలిపేందుకు కృషి చేస్తున్నాం.
రానున్న రోజుల్లో కరీంనగర్ డెయిరీ బ్రాండ్‌ను, సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. మార్కెట్ లోకి ఇతర రాష్ట్రాల పాలు ఇటీవల ఎక్కువగా వస్తున్నాయి. దేశంలో ఏ పాలు ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఉంది. అయితే కరీంనగర్ డెయిరీ అనేది లక్ష మంది పాడి రైతుల సంస్థ. కరీంనగర్ డెయిరీ లాభాలు ప్రతి సభ్యుడికి అందుతాయి. అందువల్ల కరీంనగర్ డెయిరీ ఉత్పత్తుల కొనుగోలు చేయడమంటే.. రాష్ట్రంలోని లక్ష రైతు కుటుంబాలకు అండగా నిలవడమే. మార్కెట్ లో ఎంత పోటీ ఉన్నా కరీంనగర్ డెయిరీ మీద ప్రజలకు ఉన్న విశ్వసనీయతే మా డెయిరీని నిలబెడుతుంది. వినియోగదారుల ఆదరణ, సిబ్బంది కృషి, పాడి రైతుల సహకారంతో డెయిరీని రాష్ట్రంలో నంబర్ వన్ గా నిలిపేందుకు కృషి చేస్తున్నాం.
