అసైన్డ్​ భూములకు..పట్టాలు పుట్టిచ్చిన్రు!

అసైన్డ్​ భూములకు..పట్టాలు పుట్టిచ్చిన్రు!
  • పీవోటీ చట్టాన్ని ఉల్లంఘించిన ఆఫీసర్లు
  • భూరికార్డుల ప్రక్షాళన టైమ్​లో మాయాజాలం
  • ఓ బీఆర్ఎస్  లీడర్ తండ్రి పేరిట 18 గుంటలు, మరొకరి పేరిట 1.25 ఎకరాలు ధరణిలో నమోదు
  • భూమి విలువ రూ.50 కోట్లపైనే
  • ప్రొహిబిటెడ్  లిస్టు నుంచి తొలగించుకునే యత్నం

కరీంనగర్, వెలుగు: కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని 2418 సర్వే నంబర్​లో ఉన్న హాట్ కేక్ లాంటి ప్రభుత్వ భూములను కొందరు లీడర్లు తమ కుటుంబ సభ్యుల పేరిట పట్టా చేయించుకున్నారు. దశాబ్దాల కింద దళితులకు అసైన్డ్ అయిన ఈ భూములు ఇప్పుడు దళితేతరుల చేతుల్లోకి వెళ్లాయి. ఈ సర్వేనంబర్​లో ఉన్న భూమి అంతా గవర్నమెంట్ ల్యాండ్ అని సబ్ రిజిస్ట్రార్ రికార్డులు చెప్తున్నప్పటికీ,  ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చినప్పటికీ అమ్మకాలు, కొనుగోళ్లు మాత్రం ఆగకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సర్వే నంబర్ లో భూమి కొనుగోలు చేసిన ఇద్దరు బీఆర్ఎస్ లీడర్లు.. సర్వే పేరుతో ఓ దళితుడి ఇంటి జాగలోకి చొచ్చుకెళ్లడం, సుమారు 200 మందితో హల్ చల్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  

పీవోటీ చట్టాన్ని ఉల్లంఘించిన ఆఫీసర్లు.. 

పాత పహణీల  ప్రకారం 2418 సర్వే నంబర్ లోని భూమి కొన్ని దళిత కుటుంబాల పేరిట కనిపిస్తోంది. ఏండ్ల తరబడి దళితుల పేరిట ఉన్న ఈ భూమి ఇప్పుడు దళితేతరుల పేరుపైకి ఎలా వచ్చిందనేది మిస్టరీగా మారింది. వాస్తవానికి ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ ఫర్స్(పీవోటీ) యాక్ట్ ప్రకారం అసైన్డ్ ల్యాండ్స్ అమ్మడం, కొనడం చేయవద్దు. చట్ట ప్రకారం ఇలా చేయడం నేరం కూడా. అయినప్పటికీ ఈ భూముల్లో అమ్మకాలు, కొనుగోళ్లు యథేచ్ఛగా సాగాయి. ఇందులో 2418/3/A, 2418/3/B, 2418/3/C, 2418/3/D, 2418/3/E సర్వే నంబర్లలో బీఆర్ఎస్ లీడర్ గందె శ్రీనివాస్ తండ్రి సాంబయ్య పేరిట ధరణి పోర్టల్ లో 18 గుంటల భూమి నమోదైంది. ఈ మేరకు పట్టాదారు పాస్ బుక్స్ కూడా జారీ అయ్యాయి. అలాగే 2418/6లో బహుమతుల రవీందర్ నాయుడు పేరిట మరో 1.25 ఎకరాల భూమికి పాస్ బుక్ జారీ అయినట్లు ధరణి రికార్డులు వెల్లడిస్తున్నాయి. 2418/7లో భీంరావు సుమ పేరిట 1.36 ఎకరాలకు పాస్ బుక్ జారీ అయింది.

ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న ఈ సర్వే నంబర్ ను అందులో నుంచి తొలగించాలని సదరు పట్టాదారు ధరణిలో దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.  2418/7లోనే మరో ఖాతా నంబర్ మీద 4 గుంటల భూమి మరొకరి పేరిట ఉంది. ఒకే సర్వే నంబర్ లో ఇద్దరికి ఎలా భూమి నమోదు చేశారో  రెవెన్యూ ఆఫీసర్లకే తెలియాలి. మొత్తం వీరిందరి పేరిట ఉన్న భూమి విలువ రూ.50 కోట్లపైనే ఉంటుందని అంచనా. భూరికార్డుల ప్రక్షాళనకు ముందు వరకు ఈ సర్వే నంబర్ లో అమ్మకాలు, కొనుగోళ్లు తెల్లకాగితాలు, స్టాంప్ పేపర్లపైనే జరగగా.. భూరికార్డుల ప్రక్షాళనే అదనుగా ఈ భూములపై దళితేతరుల పేర్లు వచ్చినట్లు తెలుస్తోంది. పీవోటీ చట్టాన్ని ఉల్లంఘించి అప్పటి రెవెన్యూ ఆఫీసర్లు వేరొకరి పేర్లపై ఎలా పాస్ బుక్స్ ఇచ్చారో తేలాల్సి ఉంది. 

శ్రీ పేరిట 29 ఎకరాలు.. 

హుజూరాబాద్ లో శ్రీ అనే పట్టాదారుడి పేరిట ధరణి పోర్టల్ లో 29 ఎకరాల భూమి నమోదైంది. మొత్తం 63 సర్వే నంబర్లు, బైనంబర్లలో కలిపి ఈ భూ విస్తీర్ణం ఉంది. వాస్తవానికి రాష్ట్రంలో చాలా చోట్ల పట్టాదారులు ఎవరో తెలియని సందర్భంలో ఇలా పట్టాదారు పేరు శ్రీ, తండ్రి పేరు శ్రీ అని నమోదు చేశారు. ఇలాంటి భూములు హుజూరాబాద్ లోనూ వివిధ చోట్ల 29 ఎకరాల వరకు ఉంది. అయితే ఈ భూమి ప్రస్తుతం ఎవరి ఆక్రమణలో ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇందులో ఒక్క 155 సర్వే నంబర్ లోనే 8 ఎకరాల వరకు నమోదై ఉంది.

దళితుడిపై దౌర్జన్యం.. 

2418 సర్వే నంబర్ లో అసైన్డ్ భూమి కొనుగోలు చేసిన  హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త గందె శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్  చైర్మన్​ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావుతోపాటు మరో నేత కలిసి సర్వే పేరిట తమ భూమిలోకి 200 మందితో చొరబడి భయభ్రాంతులకు గురి చేశారని హుజూరాబాద్ పట్టణానికి చెందిన గన్నారపు మొగిలి కరీంనగర్  సీపీకి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఆ సర్వే నంబర్ లో 2418లో 12 గుంటల భూమి 80 ఏండ్లుగా తమ కుటుంబం కబ్జాలో ఉందని పేర్కొన్నారు. ఈ స్థలంతోపాటు తమ పట్టా భూమి అయిన 2415, 2416, 2417లోకి కూడా చొచ్చుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. 

2418 సర్వే నంబర్ లో 12.06 ఎకరాల ప్రభుత్వ భూమి.. 

హుజూరాబాద్ నుంచి హనుమకొండకు వెళ్లే దారిలో హైవేను ఆనుకుని 2418 సర్వే నంబర్ ఉంది. ఇందులో ఉన్న 12.06 ఎకరాల భూమి సర్కార్ భూమి అని సబ్ రిజిస్ట్రార్  రికార్డులు, శిఖం భూమి అని రెవెన్యూ రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇదే విషయాన్ని మే 5, 2012న అప్పటి హుజూరాబాద్ తహసీల్దార్ కరీంనగర్​ కలెక్టర్ కు సమర్పించిన రిపోర్టు(రెఫరెన్స్ నం.ఈ3/3545/2011)లో వెల్లడించారు. ఈ రిపోర్టులో 2418 సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్ ల్యాండ్స్ వివరాలను సర్వే నంబర్లు, విస్తీర్ణం వారీగా వివరాలు పేర్కొన్నారు. సీసీఎల్ఏ ఆదేశాలతో  రిపోర్టు రూపొందించినట్లు కవరింగ్ లెటర్​లో  పేర్కొన్నారు.