గ్యాస్ కట్టర్ తో కట్ చేసి.. రెండు ఏటీఎంలలో నగదు దోపిడీ.. కరీంనగర్ జిల్లాలో ఘటనలు

గ్యాస్ కట్టర్ తో కట్ చేసి.. రెండు ఏటీఎంలలో నగదు దోపిడీ.. కరీంనగర్  జిల్లాలో ఘటనలు
  •     కరీంనగర్  జిల్లా తిమ్మాపూర్, దుర్శేడ్​లో వరుస చోరీలు
  •     రెండు ఏటీఎంలలో కలిపి రూ.15.98 లక్షల అపహరణ 
  •     నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాల ఏర్పాటు
  •     యూపీ దొంగల ముఠా పనేనని అనుమానం

కరీంనగర్, వెలుగు: కరీంనగర్  జిల్లాలో దొంగలు ఆదివారం తెల్లవారుజామున రెండు ఏటీఎంలలో దోపిడీకి పాల్పడ్డారు. స్కార్పియోలో వచ్చిన దొంగలు  గ్యాస్  కట్టర్ తో కట్ చేసి నగదు దోచుకెళ్లారు. కరీంనగర్  జిల్లా రూరల్  మండలం దుర్శేడ్​లోని ఎస్బీఐ ఏటీఎంతో పాటు తిమ్మాపూర్ లోని మరో ఎస్ బీఐ ఏటీఎంలో ఈ ఘటనలు జరిగాయి. 

దుర్శేడ్​ ఎస్బీఐ ఏటీఎంలో రూ.9,84,600 నగదు వేయగా.. దోపిడీ జరిగే సమయానికి రూ.8,85,100 వరకు నగదు ఉన్నట్లు బ్యాంకు ప్రతినిధులు గుర్తించారు. తిమ్మాపూర్  ఏటీఎంలో రూ.7,13,400 అపహరించారు. రెండు ఏటీఎంలలో కలిపి రూ.15,98,500 నగదు దోపిడీకి గురైంది. 

సీసీ కెమెరాలను ధ్వంసం చేసి..

దుండగులు ముందుగా ఏటీఎం బయట, లోపల ఉన్న సీసీ కెమెరాలకు నల్లటి స్ప్రే కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం గ్యాస్  కట్టర్ తో ఏటీఎంను ధ్వంసం చేసి 10 నిమిషాల్లోనే దోపిడీ చేసినట్లు తెలిసింది. 

తిమ్మాపూర్ లో తెల్లవారుజామున 3 గంటల సమయంలో దోపిడీకి పాల్పడిన దొంగలు.. ఆ తర్వాత 3.40 గంటలకు దుర్శేడ్​ ఏటీఎంలో నగదు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. దొంగలు తలకు టోపీ, కళ్లద్దాలు, ముసుగు ధరించి ఉన్నారు. వీరిలో ఒకరు ముసుగు ధరించిన మహిళగా సీసీ కెమెరా పుటేజీలో కనిపిస్తున్నప్పటికీ.. లేడీ గెటప్ లో మగ వ్యక్తే ఈ దోపిడీకి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఢిల్లీ ఆఫీస్ కు అలర్ట్

దేశంలోని ఎస్​బీఐ ఏటీఎంలను ధ్వంసం చేసినా, వాటిని పగులగొట్టేందుకు ప్రయత్నించినా ఢిల్లీలోని ఎస్ బీఐ సెంట్రల్  కంట్రోల్  రూమ్‌‌‌‌కు వెంటనే అలర్ట్  వెళ్తుంది. ఎస్ బీఐ తన ఏటీఎంల రక్షణ కోసం ఇ-సర్వైలెన్స్  సిస్టం అనే టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఏటీఎం మెషీన్​లో, చుట్టుపక్కల ప్రత్యేక వైబ్రేషన్, థర్మల్  సెన్సార్లు, గ్యాస్  కట్టర్  డిటెక్టర్లు, అలారాలు అమర్చి ఉంటాయి.

 దీంతో దుర్శేడ్​ ఏటీఎంలో తెల్లవారుజామున 3.40 గంటలకు దోపిడీ జరగగానే ఢిల్లీలో ఉన్న హెడ్​ ఆఫీస్ కు అలర్ట్  మెసేజ్  వెళ్లడంతో వారు ఏటీఎంలలో నగదు లోడింగ్, మెయింటనెన్స్  చేసే సీఎంఎస్  ఇన్ఫో సిస్టమ్స్  లిమిటెడ్  స్టేట్  మేనేజర్ కు సమాచారమిచ్చారు. 

ఆయన సమాచారంతో సీఎంఎస్  సంస్థ సీనియర్  ఎగ్జిక్యూటివ్  కరీంనగర్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అంతకు 40 నిమిషాల ముందే తిమ్మాపూర్  ఏటీఎంలో దోపిడీ జరిగినప్పటికీ కంట్రోల్  రూమ్ కు ఎలాంటి అలర్ట్  వెళ్లకపోవడంతో ఉదయం అటువైపుగా వెళ్లిన వాకర్స్  చూసేంత వరకు ఏటీఎం దోపిడీ వెలుగుచూడలేదు. 

డీసీపీ వెంకటరమణ, ఏసీపీ విజయ్  కుమార్, సీఐ బొల్లం రమేశ్, ఎస్సై అన్వర్  ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. స్కార్పియోలో వచ్చిన దొంగలు ఏటీఎంలలో దోపిడీకి పాల్పడి మెయిన్  రోడ్డులో కాకుండా పీఎంజే దోపిడీ దొంగల తరహాలో కెనాల్స్, గ్రామాల రోడ్ల ద్వారా మంచిర్యాలకు, అక్కడి నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

నేరం జరిగిన తీరు చూస్తే ఇది యూపీ ముఠా పనే కావొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీపీ ఆదేశాల మేరకు ప్రత్యేక టీమ్ లు గాలింపు చర్యలు చేపట్టాయి.