
- రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ల సమావేశం
- ఎన్నికల ప్రవర్తన నియమావళి, షెడ్యూల్ పై వివరణ
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విడతల వారీగా స్థానిక ఎన్నికలు నిర్వహించబోతున్నారు. షెడ్యూల్ ప్రకారం మొదటి, రెండు విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీకలకు సంబంధించి రెండో విడత (నవంబర్ 4), మూడో విడత(నవంబర్ 8)ల్లో సర్పంచ్, వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
కాగా షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి జిల్లాలో మొదటి విడత(అక్టోబర్ 31)లో ఎక్కడా పోలింగ్ నిర్వహించడం లేదు స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలు, నామినేషన్ తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయా జిల్లాల్లో కలెక్టర్లు సమావేశం ఏర్పాటు చేశారు.
కరీంనగర్ జిల్లాలో ఇలా..
మొదటి విడతలో హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఇల్లంతకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, శంకరపట్నం, వీణవంక, వి.సైదాపూర్ మండలాల్లో - అక్టోబర్ 23న, రెండో విడతలో కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చిగురుమామిడి, చొప్పదండి, గంగాధర, గన్నేరువరం, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, మానకొండూర్, రామడుగు, తిమ్మాపూర్ మండలాల్లో అక్టోబర్ 27 జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 11న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్లు లెక్కించనున్నారు.
పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రెండో విడతలో కరీంనగర్ డివిజన్ పరిధిలోని మానకొండూర్ మండలం మినహా అన్ని మండలాల పరిధిలోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నవంబర్ 4న పోలింగ్ నిర్వహించనున్నారు. మూడో విడతలో హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలతోపాటు మానకొండూర్ మండల పరిధిలోని జీపీలకు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నవంబర్ 8న ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్ వార్డు, సభ్యుల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నిర్వహించిన రోజే రిజల్ట్స్ ప్రకటించనున్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ప్రతి మూడు, నాలుగు మండలాలకు ఒక ఆర్‌వోను నియమిస్తున్నామని, మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు. ఎస్‌ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ, అంబేద్కర్ స్టేడియం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా సైదాపూర్ మండలం కుర్మపల్లి, రామచంద్రాపూర్ గ్రామాలకు కోర్టు వివాదం కారణంగా ఎన్నికలు నిర్వహించడం లేదు.
జగిత్యాల జిల్లాలో..
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో మొదటి విడతలో - అక్టోబర్ 23న బీర్పూర్, రాయికల్, సారంగాపూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్‌పల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మేడిపెల్లి మండలాల్లో, రెండో విడతలో - అక్టోబర్ 27న బుగ్గారం, ధర్మపురి, ఎండపల్లి, జగిత్యాల, జగిత్యాల రూరల్, కొడిమ్యాల, మల్యాల, పెగడపల్లి, వెల్గటూర్, గొల్లపల్లి మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో108 ఎంపీటీసీ స్థానాలు, 10 జడ్పీటీసీ స్థానాలకు, రెండో విడతలో మరో 108 ఎంపీటీసీ స్థానాలు, 10 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్య ప్రసాద్ వెల్లడించారు.
జీపీ ఎన్నికలకు సంబంధించి రెండో విడతలో మేడిపల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, సారంగాపూర్, బీర్పూర్, రాయికల్ మండలాల్లో మొత్తం 189 సర్పంచ్, 1728 వార్డు సభ్యుల స్థానాలకు నవంబర్ 4న ఎన్నికలు నిర్వహించబోతున్నారు. మూడో విడతలో ధర్మపురి, బుగ్గారం, మల్యాల, కొడిమ్యాల, ఎండపల్లి, వెల్గటూరు, జగిత్యాల రూరల్, జగిత్యాల, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో 196 సర్పంచ్, 3,536 వార్డు స్థానాలకు నవంబర్ 8న ఎన్నికలు జరగనున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలో మొత్తం 123 ఎంపీటీసీ, 12 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. మొదటి విడతలో బోయినిపల్లి, చందుర్తి, రుద్రంగి, వేములవాడ అర్బన్, రూరల్, కోనరావుపేట, ఇల్లంతకుంట మండలాల్లోని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అక్టోబర్ 23న పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.హరిత వెల్లడించారు. రెండో విడతలో తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అక్టోబర్ 27న ఎన్నికలు నిర్వహించనున్నారు.
జీపీ ఎన్నికలకు సంబంధించిన రెండో విడతలో గంభీరావుపేట, ముస్తాబాద్, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, కోనరావుపేట మండలాల్లో 137 జీపీలు, 1,188 వార్డులకు నవంబర్ 4న, మూడో విడతలో వేములవాడ అర్బన్, రుద్రంగి, చందుర్తి, వేములవాడ రూరల్, బోయినిపల్లి, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో నవంబర్ 8న పోలింగ్ నిర్వహించనున్నారు.