- విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు, పోలీసులు
గంగాధర, వెలుగు: విద్యార్థినులను అటెండర్ లైంగికంగా వేధించిన ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో సోమవారం కలకలం సృష్టించింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కురిక్యాల స్కూల్ లో అటెండర్ గా పని చేస్తున్న యాకూబ్ పాషా ఏడాదిగా విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడు.
ఇన్నాళ్లు మౌనంగా భరించిన ఓ విద్యార్థిని వారం రోజుల కింద తన తల్లిదండ్రులు, అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. దీంతో విషయాన్ని గోప్యంగా ఉంచి విచారణ చేపట్టారు. అమ్మాయిలతో తరచూ అనవసరంగా మాట్లాడడం, వారు బాత్రూంల వైపు వెళ్తున్నప్పుడు మొబైల్లో ఫొటోలు తీయడంతో పాటు రహస్యంగా కెమెరాలు పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నాడని విద్యార్థినులు తెలిపారు.
అతను తీసిన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ విద్యార్థులను మానసికంగా వేధించినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో స్కూల్ హెచ్ఎం పోలీసులకు సమాచారం అందించగా, ఎస్సై వంశీకృష్ణ, సీఐ ప్రదీప్‌కుమార్ స్కూల్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. విషయం వెలుగులోకి రావడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
విద్యార్థినుల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగారు. విద్యార్థుల వాంగ్మూలాలు, మొబైల్ ఫోన్‌తో పాటు అటెండర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కాగా, అటెండర్‌ను సస్పెండ్ చేస్తూ జడ్పీ సీఈవో శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి సీరియస్..
కురిక్యాల స్కూల్ ఘటనతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం కలిగి ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలంను కోరారు. వారితో ఫోన్లో మాట్లాడారు.
అటెండర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ కోరారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయకుమార్‌తో ఫోన్ లో మాట్లాడారు. నిందితుడి వద్ద ఉన్న వీడియోలను స్వాధీనం చేసుకొని, విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని సూచించారు.
