కరీంనగర్‌‌‌‌ జిల్లాలో ఎల్ఆర్ఎస్‌‌ ఆదాయం అంతంతే

కరీంనగర్‌‌‌‌ జిల్లాలో ఎల్ఆర్ఎస్‌‌ ఆదాయం అంతంతే
  • ఉమ్మడి కరీంనగర్‌‌‌‌ జిల్లాకు ఎల్ఆర్ఎస్ ఆదాయం రూ.109.23 కోట్లు
  • 25 శాతంతో రాయితీతో చెల్లించిన దరఖాస్తుదారులు 20 శాతంలోపే 
  • టెక్నికల్ సమస్యలతో ఫీజు చెల్లించలేకపోయిన  వేలాది మంది ప్లాట్ల ఓనర్లు

కరీంనగర్, వెలుగు: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) ఫీజు చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పించినా అధికారుల తప్పులు, సాఫ్ట్​వేర్​ లోపాలు సమస్యగా మారాయి. రాయితీ గడువు శనివారంతో ముగియగా.. మొత్తం దరఖాస్తుదారుల్లో 20 శాతానికి మించి ఫీజు చెల్లించలేదు. ఇంకా 80 శాతం అప్లికేషన్లు పెండింగ్‌‌లోనే ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ ద్వారా ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలకు శనివారం నాటికి రూ.109.23 కోట్ల ఆదాయం సమకూరింది. రామగుండం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అకారణంగా కొన్ని ప్లాట్లను ప్రొహిబిటెడ్/ఎఫ్ టీఎల్ పరిధిలో చేర్చడం, కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా వేలాది మంది ఫీజు చెల్లించలేపోయారు.  

కరీంనగర్ జిల్లాలో అత్యధికం

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(సుడా)తోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో మొత్తం 68,563 అప్లికేషన్లు రాగా వీటిలో 48,109 అప్లికేషన్లకు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు జనరేటయ్యాయి.  ఇందులో 13,322 మంది ప్లాట్ల ఓనర్లు ఫీజులు చెల్లించగా శనివారం రాత్రి 8 గంటల వరకు రూ.54.32 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో కరీంనగర్ బల్దియాకు రూ.38.41 కోట్లు, మూడు మున్సిపాలిటీలకు రూ.6.76 కోట్లు, సుడాకు రూ.6.74 కోట్లు, జీపీలకు రూ.2.41 కోట్ల రాబడి వచ్చింది. ఫీజు చెల్లించిన ప్లాట్లలో 4,434 ప్లాట్లకు ప్రొసీడింగ్స్ జారీ చేశారు. 

జగిత్యాల జిల్లా ఆదాయం రూ.17.13 కోట్లు.. 

జగిత్యాల జిల్లావ్యాప్తంగా మున్సిపాలిటీలు, జీపీల్లో కలిపి 38,995 అప్లికేషన్లు రాగా, ఇందులో 32,315 ప్లాట్లకు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు జనరేట్ అయ్యాయి. పంచాయతీల పరిధిలో 9,795 ప్లాట్లకు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు జారీ కాగా, ఇందులో  2,100 దరఖాస్తులకు ఫీజు చెల్లించారు. తద్వారా రూ.4.78 కోట్ల ఆదాయం సమకూరింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 27,484 దరఖాస్తులు రాగా, 22,520 ప్లాట్లకు ఫీ ఇంటిమేషన్ లెటర్లు అందజేశారు. ఇందులో 3,739 దరఖాస్తులకు ఫీజులు చెల్లించారు.

 దీంతో మున్సిపాలిటీలకు రూ. 12.35 కోట్ల ఆదాయం సమకూరింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మున్సిపాలిటీలో 10,526 ధరఖాస్తులు రాగా 7,656 దరఖాస్తులకు ఫీ ఇంటిమేషన్ లెటర్లు అందాయి. ఇందులో 1,631 ప్లాట్లకు ఫీజు చెల్లించగా రూ.5.91 కోట్ల ఆదాయం సమకూరింది. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో 16,390 అప్లికేషన్స్ రాగా ఇందులో 3,298 మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారు. తద్వారా వేములవాడ మున్సిపాలిటీకి రూ.6.81 కోట్ల ఆదాయం వచ్చింది. 

పెద్దపల్లి జిల్లాకు 25.06 కోట్లు.. 

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, మంథని, సుల్తానాబాద్, పెద్దపల్లి మున్సిపాలిటీలతోపాటు జీపీల పరిధిలో ఎల్ఆర్ఎస్ కోసం 25,683 అప్లికేషన్లు రాగా 19,294 ప్లాట్లకు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు జనరేట్ అయ్యాయి. వీరిలో 6,339 ప్లాట్లకు ఫీజు చెల్లించడం ద్వారా రూ.25.06 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో అత్యధికంగా పెద్దపల్లి 
మున్సిపాలిటీ పరిధిలో 7,771 ప్లాట్లకుగానూ 3,104 ప్లాట్లకు ఫీజు చెల్లించగా 11.57 కోట్ల ఆదాయం సమకూరింది.

జిల్లా    ఆదాయం   (రూ.కోట్లలో) 

కరీంనగర్    54.32
పెద్దపల్లి    25.06
జగిత్యాల    17.13 
రాజన్నసిరిసిల్ల    12.72 
మొత్తం    109.23