కరీంనగర్ రూరల్, వెలుగు: ఒకే ఇంట్లో రెండు సార్లు చోరీ చేసిన దొంగను పట్టుకున్నట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. కరీంనగర్ రూరల్ పరిధిలోని తీగలగుట్టపల్లిలోని రెవెన్యూ కాలనీకి చెందిన మహమ్మద్ ముస్తాక్ ఆన్‌లైన్ బెట్టింగ్, డాష్ రమ్మీ ఆటలో డబ్బులు పోగొట్టుకున్నాడు. చేసిన అప్పులు చెల్లించలేక దొంగగా మారాడు. ఈక్రమంలో ఫిబ్రవరి, జూన్ నెలలో తీగలగుట్టపల్లిలోని ఒకే ఇంట్లో రెండుసార్లు చోరీకి పాల్పడి బంగారు, నగదు చోరీ చేశాడు.
బంగారం అమ్ముదామని సూర్యాపేట జిల్లా కోదాడకు వెళ్లాడు. అక్కడా ఎవరూ కొనకపోవడంతో తిరిగి తీగలగుట్టపల్లికి వచ్చాడు. కరీంనగర్ లేదా వరంగల్‌లో అమ్ముదామని భావించి బుధవారం తీగలగుట్టపల్లి రైల్వేస్టేషన్ వద్ద నిలబడి ఉన్నాడు. అనుమానాస్పదంగా కనిపించడంతో సీఐ ఎ.నిరంజన్ రెడ్డిపట్టుకున్నారు. అతడి వద్ద సుమారు 91 గ్రాముల బంగారం, రూ.5 వేల నగదు, ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు.
