కరీంనగర్ టౌన్/కొత్తపల్లి, వెలుగు: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ స్కూల్‌లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌లో వివిధ స్కూల్ విద్యార్థులు సత్తాచాటి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. మంగళవారం మానేరు స్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చైర్మన్ కడారి అనంతరెడ్డి మాట్లాడుతూ ‘సుస్థిర వ్యవసాయం’ అనే అంశంపై తమ స్టూడెంట్ డి.అమర్‌నాథ్ తయారు చేసిన ప్రాజెక్ట్ జిల్లాలో స్థాయిలో సత్తాచాటి స్టేట్ లెవెల్‌కు ఎంపికైనట్లు తెలిపారు.
దీంతోపాటు రిక్రియేషనల్ మాథ్స్ విభాగంలో పి.సంజన్ తేజ్ రాణించి, జిల్లాస్థాయిలో రెండో స్థానంలో, సైన్స్ సెమినార్ ఉపన్యాసంలో జోహా ఆనం థర్డ్ ప్లేస్ లో నిలిచినట్లు ఆయన తెలిపారు. అలాగే నీటి సంరక్షణ, నిర్వహణపై ప్రాజెక్ట్ తయారు చేసిన కోట పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ కొమ్ము జోయిల్ జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచినట్లు చైర్మన్ అంజిరెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తుండడం వల్లే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయన్నారు. సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్ అనూష్‌రాజ్ తయారు చేసిన ‘షెషెంట్ లిఫ్ట్’ ప్రాజెక్ట్ స్టేట్ లెవెల్‌కు ఎంపికైనట్లు చైర్మన్ పి.ఫాతిమారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా స్టూడెంట్‌ను, గైడ్ టీచర్ నరేశ్‌ను చైర్మన్ అభినందించారు.
