కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో లోకల్ ఎలక్షన్కు బ్రేక్‌‌‌‌

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో లోకల్ ఎలక్షన్కు బ్రేక్‌‌‌‌
  •  హైకోర్టు స్టేతో ఆగిన ఎన్నికల ప్రక్రియ 
  • నిరాశలో ఆశావహులు
  • స్టే వచ్చేలోపు జడ్పీటీసీకి 3, ఎంపీటీసీకి 5 నామినేషన్ల దాఖలు

 కరీంనగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు: స్థానిక సంస్థల సందడి కాసేపైనా నిలవలేదు. ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గురువారం ఉదయం నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేశారు. ఈ క్రమంలోనే హైకోర్టు జీవో నెంబర్ 9 పై స్టే విధించడం, ఎన్నికల ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఆశావహులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మధ్యంతర స్టే వచ్చేలోపు ఉమ్మడి జిల్లాలో జడ్పీటీసీ 3, ఎంపీటీసీ స్థానాలకు 5 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల కలెక్టర్లు నామినేషన్​ కేంద్రాలను
 పరిశీలించారు. 

ఉదయమంతా ఖుషి.. అంతలోనే డల్‌‌‌‌ 

ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌తో గురువారం ఉదయం ఆశావాహులు సంతోషంగా కన్పించారు. నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమయింది. వివిధ మండలాల్లో ఆఫీసర్లు కూడా నామినేషన్ల స్వీకరణకు ఎంపీడీవో ఆఫీసుల్లో ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎన్నికల పరిశీలకులుగా పలుచోట్ల ఐఏఎస్‍ ఆఫీసర్లు జిల్లాలకు చేరుకున్నారు. రిటర్నింగ్‍ ఆఫీసర్లు, సిబ్బంది మండలాలకు చేరుకుని డ్యూటీల్లో చేరారు. 

మరోవైపు ఆశావహులు టిక్కెట్ల కోసం ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల పెద్దలను కలుస్తూనే మరోవైపు నామినేషన్లు వేసేందుకు సన్నద్ధమయ్యారు. కాగా, ప్రధాన పార్టీల నేతలు మాత్రం కోర్టు తీర్పుపై కొంత ఉత్కంఠగా ఎదురుచూశారు. తీరా సాయంత్రం 4 గంటల సమయంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్‍ పడింది. దీంతో లోకల్‍ బాడీ ఎలక్షన్లలో బరిలో నిలిచి అదృష్టం పరీక్షించుకోవాలని భావించిన అభ్యర్థులు ఒక్కసారిగా
 డల్‍ అయ్యారు. 

అప్పటికే నామినేషన్లు మొదలు 

హైకోర్టు తీర్పు వచ్చేలోపే ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో నామినేషన్లు దాఖలయ్యాయి. జగిత్యాల జిల్లా కథలాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం పెగ్గెర్ల ఎంపీటీసీ కాంగ్రెస్ తరఫున కారపు గంగాధర్,  ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి ఎంపీటీసీ స్థానానికి కాంగ్రెస్ తరఫున నాంపల్లి వేంకటాద్రి నామినేషన్ దాఖలు చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రూరల్, బోయినపల్లి మండల జడ్పీటీసీ స్థానాలకు ఒక్కో నామినేషన్ దాఖలు అయ్యాయి. 

దీంతోపాటు వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట ఎంపీటీసీ స్థానానికి ఒక నామినేషన్ దాఖలు అయింది. కరీంనగర్ జిల్లాలో  శంకరపట్నం మండలం కన్నాపూర్ ఎంపీటీసీ స్థానానికి రెడ్డి కుమార్, మెట్‌‌‌‌పల్లి ఎంపీటీసీ స్థానానికి గొట్టే మధు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేశారు. దీంతోపాటు వి.సైదాపూర్ జడ్పీటీసీ స్థానానికి లంకదాసరి అరుణ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేశారు.