
- 58.86 కి.మీ హైవే నిర్మాణం, భూసేకరణకు రూ.1,979 కోట్లు కేటాయింపు
- గతంలో రూ.1503 కోట్ల నుంచి అంచనాలు పెంపు
- టెండర్ ఖరారైతే త్వరలో భూసేకరణ.. ఆ తర్వాత నిర్మాణ పనులు
- ఆరేండ్ల కింద భారత్ మాల పరియోజన కింద ఫోర్ లేన్ రోడ్డు మంజూరు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్– జగిత్యాల ఫోర్ లేన్ రోడ్డు నిర్మాణ ప్రక్రియలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఆరేళ్ల కింద భారత్ మాల పరియోజనలో భాగంగా మంజూరైన ఈ రహదారి నిర్మాణ పనులు భూసేకరణ, రోడ్డు వెంట గ్రామాల్లోని వివాదాలు తదితర కారణాలతో అటకెక్కిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూలైలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి త్వరగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేలా ఆఫీసర్లను ఆదేశించాలని కోరారు.
ఈ క్రమంలోనే కరీంనగర్–- జగిత్యాల హైవే 563 నిర్మాణానికి కేంద్ర రోడ్డు, రవాణా శాఖ తాజాగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. కరీంనగర్ బైపాస్‌లోని కొత్తపల్లి నుంచి జగిత్యాల వరకు 58.866 కిలోమీటర్ల మేర హైవే నిర్మాణానికి రూ.1,979 కోట్లు కేటాయించారు.
భూసేకరణలో జాప్యం..
జగిత్యాల–-కరీంనగర్ రోడ్డును 563 నేషనల్ హైవేగా గుర్తించిన కేంద్రం ఆరేళ్ల కింద రూ.1503 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం రెండు వరసలు ఉన్న ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటోంది. దీంతోపాటు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడంతో రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. 58.86 కిలోమీటర్ల రహదారి విస్తరణకు 245.94 హెక్టార్ల భూమి సేకరించాలని అప్పట్లో నిర్ణయించారు. ఈ భూసేకరణకు ప్రభుత్వం సుమారు రూ.387 కోట్లు కేటాయించింది.
ఇందులో 157 హెక్టార్లు జగిత్యాల జిల్లాలో.. మిగతా 88.94 హెక్టార్లు కరీంనగర్ జిల్లాలో సేకరించేందుకు గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే జిల్లాలో భూములు సేకరించి, అవార్డు పాస్ చేసి మూడేళ్లు దాటినా నిర్వాసితుల అకౌంట్లలో డబ్బులు జమ చేయలేదు. జగిత్యాల జిల్లాలో సేకరించిన భూమికి రూ.124 కోట్లు పరిహారం చెల్లించాల్సి ఉండగా.. కేవలం జగిత్యాల, చల్గల్, రాజారం, నూకపల్లి, నాచుపల్లి, గౌరాపూర్ గ్రామాల్లోని కొద్ది మంది భూనిర్వాసితులకు రూ.4 కోట్లు పరిహారం చెల్లించి వదిలేశారు. ఇప్పటికీ నిర్వాసితులైన రైతులు జగిత్యాల ఆర్డీవో ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు.
భారీగా అంచనాలు పెంపు..
కాగా కరీంనగర్– జగిత్యాల రోడ్డు విస్తరణకు తొలుత ఆరేళ్ల కింద రూ.1504 కోట్లు కేటాయించగా నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, భూసేకరణ వ్యయం పెరగడం, జీఎస్టీ చార్జీల నేపథ్యంలో ఈ మొత్తాన్ని రూ.1,979 కోట్లకు పెంచినట్లు తెలిసింది. ఈ రహదారికి అనుసంధానమయ్యే కరీంనగర్–- వరంగల్ హైవే పనులు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యాయి. ఈ రోడ్లు పూర్తయితే ప్రమాదాలు తగ్గటంతోపాటు రాకపోకలు పెరగనున్నాయి.