Ugadi Rasi Phalalu 2023 - Karkataka Rashi : కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Rasi Phalalu 2023 - Karkataka Rashi : కర్కాటక రాశి ఫలితాలు

గురువు 22.03.2023 నుంచి 21.04.2023 వరకు మీన రాశి యందు, తదుపరి ఉగాది 08.04.2024 వరకు దశమ స్థానంలో సంచారం. శని 22.03.2023 నుంచి మరల ఉగాది వరకు అష్టమ స్థానంలో సంచారం. రాహువు 22.03.2023 నుంచి 31.10.2023 దశమ స్థానంలో, తదుపరి ఉగాది వరకు భాగ్య స్థానంలో సంచారం. కేతువు 28.10.2023 నుంచి ఉగాది వరకు వ్యయంలో సంచారం.

ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉంటుంది. రైతు సోదరులు తిథి, నక్షత్రాలను చూసుకుని వ్యవసాయం చేయడం వల్ల అధిక దిగుబడులు. వృత్తి వ్యాపారులకు అధిక లాభాలు. లాయర్లు, డాక్టర్లకు చాలా అనుకూలం. రాజకీయ నాయకులకు అధిక ధన వ్యయం ఉంటుంది. కాంట్రాక్టర్లకు గతంలో కంటే బాగుంటుంది. చిన్న పరిశ్రమల వారికి అనుకూలం. పెద్ద పరిశ్రమల వారికి ఆకస్మిక ధన రాబడి. వెండి, బంగారం, ఇనుము, సిమెంట్‌, టింబర్‌‌, కంకర వ్యాపారులకు అనుకూలం. షేర్స్‌‌లో డబ్బు పెట్టిన వారికి అస్సలు ఏమీ అర్థం కాదు. చేపల చెరువులు, పాడి పరిశ్రమకు అనుకూలంగా ఉంటుంది. అయినా జాగ్రత్తగా ఉండాలి. లంచగొండి ఉద్యోగులకు ఆకస్మిక సమస్యలు, సినిమా, టీవీ వారికి సామాన్యం. డబ్బును అధికంగా ఖర్చు చేస్తారు. ఆర్భాటం కోసం అధిక వ్యయం చేస్తారు. నూతన పరిశ్రమలు లాభించగలవు. మీరు తలపెట్టిన చిన్న పెద్ద కార్యములన్నింటిపైనా మనసు లగ్నం చేయండి. పనులు సకాలంలో నెరవేరుతాయి. గురు జపములు, గురు పూజలు చేయడం వలన మనం చేసే వ్యాపారాలు, ఉద్యోగాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉద్రేకానికి లోను కారాదు. ఆధ్యాత్మికంగా ఉన్న వారికి మానసిక ఒత్తిడి లేకపోవడం వల్ల తెలియని విధంగా అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటారు. శుభకార్యాలు నెరవేరతాయి. పుణ్యక్షేత్రాల సందర్శన వల్ల పెండింగ్‌ పనులు నెరవేరుతాయి. రాజీ మార్గాల్లో ప్రయత్నాలు చేయడం వల్ల కోర్టు కేసులు పరిష్కరించుకునేందుకు ఇది సరైన సమయం. శనివారం శనికి తైలాభిషేకం, ఎరుపు నువ్వులు కడిగి ఎండపెట్టినవి దానం ఇవ్వండి. నలుపు వస్త్రాలు, నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించుకోవడం వలన శత్రు శేషములు తగ్గును.  భార్యాభర్తల గొడవలు, అనేక విపత్తులు, అనారోగ్య సమస్యలు నివారణ జరుగును. నూతన వ్యాపారాలు ప్రారంభించరాదు. డబ్బు ఎవరికి ఇచ్చినా తిరిగిరాదు. జాయింట్‌ వ్యాపారాల్లో ఉన్న వారికి మాటపట్టింపులు వస్తాయి. తక్కువగా మాట్లాడాలి. సుఖ జీవన విధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. రాహుకేతువులు అనుకూలించగలరు. వీటిని నిర్లక్ష్యంగా చూడరాదు. వినాయకుడు, సరస్వతి, దుర్గాదేవి, పార్వతి దర్శన భాగ్యముతో ప్రతి విషయంలో అనుకూలంగా ఉంటుంది. పునర్వసు నక్షత్రం వారు కనక పుష్యరాగం ధరించి గురు పూజలు, సాయినాథుని దర్శనం, గురు చరిత్ర పారాయణం చేయండి. పుష్యమి నక్షత్రం వారు ఇంద్ర నీలం ధరించి, శని పూజలు చేయండి. మీరు చేసే వ్యాపారాలు లేక ఉద్యోగం విషయంలో ఏదైన సమస్య వస్తే శని జపములు తైలాభిషేకం అనంతరం తోలు చెప్పులు, ఇనుప గంటి, నలుపు గొడుగు, నలుపు గొర్రె బొచ్చు గొంగళి, బ్రాహ్మణునికి దానం ఇవ్వండి. ఆశ్లేష నక్షత్రం వారు జాతి పచ్చ ఉంగరం కుడి చేతి చిటికెన వేలుకు ధరించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చక్కెర పొంగలి ప్రసాదాలు స్వామి వారికి అలంకరణ చేయిస్తే, ప్రతి విషయంలో సామరస్య ధోరణి కలిగి ఆనందంగా ఉంటారు. ప్రధానంగా శివారాధన మహాన్యాస రుద్రాభిషేకం చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. భక్తి విశ్వాసాలతో ఆచరించండి. ఎవరికి, ఏ విధమైన సమస్యలు ఉన్నా మీకు తెలియకుండా వచ్చినవి.. తెలియకుండానే నివారణోపాయం ఉంటుంది. మీ విశ్వాసమే మీ బలంగా గుర్తు ఉంచుకోవాలి. అదృష్ట సంఖ్య 2.

కర్కాటక రాశి మాస ఫలితాలు

చైత్ర మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉన్నట్లుగా ఉంటుంది. కానీ, చేసే పనిలో ఏదో ఒక సమస్య వచ్చి అంతరాయం ఏర్పడుటకు అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా చాకచక్యంగా కార్యసాధనలో నిర్ణయం తీసుకోవాలి. నవ గ్రహ ప్రదక్షిణలు, జపములు, దానములు ఆచరించండి.

వైశాఖ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా ఉంటుంది. విందు వినోదం ఆర్భాటాలకు అధిక ధనం ఖర్చు చేస్తారు. ఆశించిన ఫలితం రాదు. తొందరపాటు నిర్ణయాలు వల్ల అనేక విధాలుగా చికాకు పడతారు. స్టూడెంట్స్​ చాలా జాగ్రత్తలు పాటించగలరు. సరస్వతీ దేవి పూజలు చేయగలరు. 

జ్యేష్ఠ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు చాలా సామాన్యంగా ఉంటుంది. ప్రతి విషయంలో పట్టుదల కలిగి జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు సాగండి. మీరు నిర్లక్ష్యంగా ఉండి, ఎవరికైనా హామీదారుగా ఉన్నా మీరే కట్టాల్సి ఉంటుంది. ఒక రకంగా చాలా గడ్డు సమస్యలకు గురికాకుండా జాగ్రత్త పడాలి. సాయి నామం పఠిస్తే, అలాంటి అవరోధాలు తొలగుతాయి. 

ఆషాఢ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాల్సిన రోజులు ఇవి. నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ఏ మాత్రం భయపడకూడదు. శని స్తోత్రం, శని ఆరాధన, శివ ధ్యానం వల్ల కొంత వరకు ఉపశమనం ఉంటుంది. 

అధిక శ్రావణ మాసం:  ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉంటుంది. కానీ, మానసిక ఒత్తిడికి గురి కారాదు. మీరు చాలా విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. సత్యదేవుని వ్రతం, నవ గ్రహ ఆరాధనం, ప్రదక్షిణాలు, దానాల వలన కొన్ని విధాలుగా పురోగతి ఉంటుంది. 

నిజ శ్రావణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉన్నట్లు ఉంటుంది కానీ, మనసు లోపల తెలియని భయంతో ఉంటారు. చేయాల్సిన పనులకు ఏదో ఒక కారణం చేత బ్రేకులు పడతాయి. కారణం.. గ్రహ మైత్రిలో సమస్యలు ఉన్నవి. గ్రహ ఆరాధన వలన గృహంలో శాంతి ఉంటుంది. నిత్యదీపారాధన చేస్తే ఓర్పునిస్తుంది. సమస్యల నుండి విముక్తి పొందుతారు.

భాద్రపద మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు తెలియని అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆకస్మికంగా ధన వ్యయం వల్ల మనసులో భయం ఉంటుంది . విఘ్నేశ్వరుడి పూజ సంతృప్తినిస్తుంది. ఆర్థికంగా లోటు రాకుండా లక్ష్మీ కుబేరుడి పూజలు చేస్తే, తప్పకుండా ఫలితాలు వస్తాయి. మీ నమ్మకమే మీ బలం. 

ఆశ్వయుజ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా ఉంటుంది. అమ్మవారి పూజల వల్ల విపత్తులు తొలగిపోవును. మీరు చేసే వ్యాపార వృత్తుల్లో విజయం ఉండాలంటే అమ్మ రక్షణ కావాలి. పితృదేవతల ఆశీర్వాద బలం కావాలి. మనో నిగ్రహం ఉంటుంది. 

కార్తీక మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు కొంత వరకు అనుకూలం. డబ్బు విషయంలో ఖర్చు పెట్టాల్సి వస్తే వాయిదా వేయండి. ప్రతి విషయంలో తొందరపాటు నిర్ణయాల వలన అనేక విధాలుగా సమస్యలు వస్తాయి. శివారాధన సంతృప్తిని ఇస్తుంది. అఖండ దీపారాధన వలన మనఃశ్శాంతి ఉంటుంది. 

మార్గశిర మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు ప్రతి విషయంలో అనుకూలం. అలాగే సమస్యలు కూడా పక్కనే ఉంటాయి. ప్రయత్న లాభం ఉంటుంది. అందరి మెప్పు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు చాలా ఓర్పుతో ఉంటే పరీక్షల్లో విజయం సాధిస్తారు. 

పుష్య మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా ఉంటుంది. మానసిక సమస్య మనిషిని బాధిస్తుంది. పట్టుదల, నమ్మకం, గ్రహాల కలయిక కోసం లక్ష్మీ నారాయణుల పూజలు చేయడం వల్ల ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః స్తోత్రంతో పాటు గోవింద నామాలు పఠించండి.  ప్రశాంతంగా ఉంటారు.

మాఘ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలం. విందు వినోదాలు, శుభ కార్యాలు జరుగుటకు చాలా అనుకూలమైన రోజులు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల మన్ననలు, సంఘంలో గౌరవమైన విధంగా ఆలోచనలు చేస్తారు. కుల దేవత ఆరాధన వల్ల శక్తి వస్తుంది. 

ఫాల్గుణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కొన్ని విషయాల్లో చాలా ఉత్సాహంగా ఉంటుంది. తాత్కాలిక ఆనందం పొందండి. జాగ్రత్తల విషయంలో రాజీ పడొద్దు. నవ గ్రహ ప్రదక్షిణలు చేయండి.