రాష్ట్రపతి, గవర్నర్లు కేవలం నామమాత్రపు అధిపతులు.. మంత్రి మండళ్ల సలహాను పాటించాల్సిందే.. సుప్రీంలో కర్నాటక వాదన

రాష్ట్రపతి, గవర్నర్లు కేవలం నామమాత్రపు అధిపతులు.. మంత్రి మండళ్ల సలహాను పాటించాల్సిందే.. సుప్రీంలో కర్నాటక వాదన

న్యూఢిల్లీ: రాష్ట్రపతి, గవర్నర్ నామమాత్రపు అధిపతులు మాత్రమేనని, వారు కేంద్ర, రాష్ట్ర మంత్రి మండళ్ల సలహామేరకు పనిచేయాల్సి ఉంటుందని కాంగ్రెస్‌‌‌‌ నేతృత్వంలోని కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో వాదించింది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లకు స్వతంత్ర అధికారాలు లేవని, మంత్రి మండలి సలహాను తప్పనిసరిగా పాటించాలని చెప్పింది. 

ఆర్టికల్‌‌‌‌ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్‌‌‌‌కు ఎటువంటి కార్యనిర్వాహక విధులు లేవని, అందుకే వారిపై క్రిమినల్‌‌‌‌ చర్యలు తీసుకోరాదని చట్టం చెప్తోందని ప్రభుత్వం తరఫున సీనియర్‌‌‌‌‌‌‌‌ న్యాయవాది గోపాల్ సుబ్రమణియన్.. సీజేఐ జస్టిస్​ బీఆర్‌‌‌‌‌‌‌‌ గవాయ్‌‌‌‌ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనానికి తెలిపారు. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి కచ్చితమైన గడువు విధించవచ్చా అనే అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలతో రిఫరెన్స్ పంపిన నేపథ్యంలో మంగళవారం ఈ వాదనలు జరిగాయి.

ఒక రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలుండవ్‌‌‌‌..

రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వానికి సమానంగా మరో పాలనా వ్యవస్థను రాజ్యాంగం అనుమతించదని, గవర్నర్లు స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేదని సుబ్రమణియన్ వాదించారు. సీఆర్‌‌‌‌పీసీ సెక్షన్ 197 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు పెట్టాలంటే ముందస్తు అనుమతి తీసుకోవడంపై చీఫ్ జస్టిస్ గవాయ్ ప్రశ్నించగా, ఈ విషయంలో మంత్రి మండలి సలహా లేకుండానే గవర్నర్లు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పిందని సుబ్రమణియన్ వివరించారు. 

సుప్రీం కోర్టులో బెంగాల్‌‌‌‌ ప్రభుత్వం వేసిన ఇలాంటి కేసును ఆయన ఉదహరించారు. శాసనసభ ఆమోదించిన బిల్లు ప్రజల ఇష్టాన్ని ప్రతిబింబిస్తుందని, దానిని గవర్నర్‌‌‌‌‌‌‌‌ లేదా రాష్ట్రపతి తన ఇష్టానుసారం నిలిపివేయలేరని బెంగాల్‌‌‌‌ ప్రభుత్వం సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 3న వాదించిందని గుర్తుచేశారు. బిల్లు రాజ్యాంగబద్ధతను పరిశీలించే అధికారం న్యాయస్థానాలకు మాత్రమే ఉంటుందని టీఎంసీ సర్కారు కోర్టుకు తెలిపిందన్నారు.