రూ.10వేల రూపాయి నాణేలతో నామినేషన్ వేయడానికి వచ్చిన స్వతంత్ర అభ్యర్థి

 రూ.10వేల రూపాయి నాణేలతో నామినేషన్ వేయడానికి వచ్చిన స్వతంత్ర అభ్యర్థి

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరుగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అందులో భాగంగా యాద్గిర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి యంకప్ప సైతం నామినేషన్ ఫైల్ చేసేందుకు సిద్ధమయ్యారు. అంతకంటే ముందు తన డిపాజిట్ సొమ్ము రూ.10వేలను చెల్లించడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అతను కేవలం రూపాయి నాణేలతోనే రూ.10వేలను డిపాజిట్ గా చెల్లించారు కాబట్టి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు గానూ యంకప్ప.. నియోజకవర్గ వ్యాప్తంగా సంచరించి, ప్రజల నుంచి ఈ నాణేలను సేకరించారు.

‘‘నా సామాజికవర్గం, గ్రామస్థులకు నా జీవితాన్ని అంకితం చేస్తాను.. స్వామి వివేకానంద సిద్ధాంతాల పోస్టర్లుతో రిటర్నింగ్‌ అధికారి వద్దకు వచ్చాను’’ అంటూ యంకప్ప నామినేషన్ దాఖలుకు ముందు చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే మెడలో 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వరుడు, సన్యాసి-కవి కనకదాసు, స్వామి వివేకానంద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగ ప్రవేశికతో కూడిన బ్యానర్‌తో ఆయన రిటర్నింగ్ అధికారి వద్దకు వచ్చారు.

ఈ పోస్టర్లు, బ్యానర్లతో పాటు ఒక్క రూపాయి మాత్రమే కాదు... మీ ఒక్క ఓటును నాకు వేయండి, నేను మీకు పేదరికం నుండి విముక్తిని ఇస్తాను” అనే స్లోగన్ యంకప్ప డిపాజిట్ దాఖలు చేసేందుకు వచ్చారు. యంకప్ప కలబురగి జిల్లాలోని గుల్బర్గా యూనివర్శిటీలో ఆర్ట్స్ గ్రాడ్యుయేట్. అతని మొత్తం ఆస్తుల విలువ రూ.60వేలు కాగా, అతని తండ్రి దేవింద్రప్పకు ఒక ఎకరం,16 గుంటల భూమి (40 గుంటలు ఒక ఎకరానికి సమానం) ఉంది. ఈ సందర్భంగా నియోజకవర్గమంతా కాలినడకన పర్యటించి ఓటర్ల నుంచి నాణేలను సేకరించినట్లు యంకప్ప తెలిపారు. మరో ముఖ్య విషయమేమిటంటే నాణేలను లెక్కించేందుకు ఎన్నికల అధికారులకు రెండు గంటల సమయం పట్టింది.