
- కస్టమర్తోమేనేజర్ ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదు: సిద్ధరామయ్య
బెంగళూరు: కర్నాటక ఎస్బీఐలో నెలకొన్న కన్నడ వివాదంపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య స్పందించారు. కస్టమర్లతో బ్యాంకు మేనేజర్ నిర్లక్ష్యంగా ప్రవర్తించడం సరైంది కాదని అన్నారు. లోకల్ లాంగ్వేజ్‌ను బ్యాంకు ఉద్యోగులందరూ తప్పనిసరిగా గౌరవించాలని, కస్టమర్లతో స్థానిక భాషలోనే మర్యాదగా మాట్లాడాలని సూచించారు. అనేకల్తాలూకాలోని సూర్యనగర ఎస్‌బీఐ బ్రాంచ్‌లో కన్నడ మాట్లాడటానికి నిరాకరించిన ఎస్‌బీఐ మేనేజర్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా.. బుధవారం ‘ఎక్స్’ వేదికగా సిద్ధరామయ్య స్పందించారు. ఆ మేనేజర్‌ను ఎస్‌బీఐ వెంటనే బదిలీ చేసిందని.. ఇంతటితో ఈ సమస్య సద్దుమణిగినట్లుగా భావిస్తున్నామని తెలిపారు.
ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలి
సూర్యనగర ఎస్‌బీఐ బ్రాంచ్‌లో జరిగిన భాషా వివాదం ఘటనలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సిద్ధ రామయ్య సూచించారు. దేశంలోని అన్ని బ్యాంకుల సిబ్బందికి ఆయా ప్రాంతాల సంస్కృతి, భాష వంటి విషయాల్లో ట్రైనింగ్ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగాన్ని కోరారు. స్థానిక భాషను గౌరవించడం అంటే ప్రజలను గౌరవించడం అని చెప్పారు. ‘కన్నడ ఫస్ట్’అనే హ్యాష్‌ట్యాగ్‌ను పోస్ట్‌కు జోడించారు. దేశంలో భాషా వివాదం కొనసాగుతున్న వేళ ఇలాంటి ఘటనలతో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. కస్టమర్‌తో దురుసుగా ప్రవర్తించిన మేనేజర్‌ను బదిలీ చేయడంపై ఎస్బీఐను ప్రశంసించారు. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు.