టమాటాలు అమ్మి రూ.38 లక్షలు సంపాదించిన రైతు

 టమాటాలు అమ్మి రూ.38 లక్షలు సంపాదించిన రైతు

దేశ వ్యాప్తంగా టమాటా వినియోగదారులకు చుక్కలు చూపిస్తుండగా..రైతులకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది.  మొన్నటి వరకు కిలో టమాటా రూ. 20, రూ. 30 పలుకగా..ఇప్పుడు ఏకంగా  రూ. 200కు పెరగడంతో అన్నదాతలు లక్షాధికారులు అవుతున్నారు. తాజాగా కర్ణాటకలోని ఓ రైతు కుటుంబం  టమాటాలు అమ్మి ఏకంగా రూ.38 లక్షలు సంపాదించింది. అదీ ఒక్కరోజులేనే అన్నదాత కుటుంబానికి రూ. 38 లక్షలు దక్కడం విశేషం. 

కర్ణాటకలోని కొందరు రైతులకు టమాటా ధరలు పెరగడం వరంగా మరింది. కోలార్‌కు చెందిన ఓ రైతు కుటుంబం జులై 11వ తేదీ మంగళవారం 2000 బాక్సుల టమాట అమ్మి ఏకంగా రూ.38 లక్షలు సంపాదించిందని టైమ్స్‌ ఆఫ్ ఇండియా రిపోర్ట్‌ పేర్కొంది. 

కర్ణాటకలోని బేతమంగళ జిల్లాలో ప్రభాకర్ గుప్తా ఆయన సోదరులు కలిసి 40 ఎకరాల్లో గత 40 ఏళ్లుగా టమాటాతో పాటు ఇతర పంటలను సాగు చేస్తున్నారు.  రెండేళ్ల క్రితం వీరు 15 కిలోల టమాట బాక్స్‌  ఒక్కోటి రూ.800కు అమ్మారు.  కానీ జులై 11వ తేదీ  మంగళవారం ఒక్కో డబ్బాను ఏకంగా రూ.1900కు  విక్రయించారు.  

చింతామణి తాలూకా విజకూర్‌ గ్రామానికి చెందిన వెంకట రమణా రెడ్డి అనే రైతు జులై 11వ తేదీ  మంగళవారం 15 కిలోల టమాట బాక్సును రూ.2200కు అమ్మారు. రెండేళ్ల క్రితం రూ.900 ఒక్కో బాక్సు అమ్మానని తెలిపాడు. తాను ఒకే ఎకరంలో టమాట వేశానని 54 బాక్సులను కోలార్‌లోని ఏపీఎంసీ మార్కెట్‌కు తెచ్చానని వెల్లడించారు. అందులో 36 డబ్బాలు రూ.2200, మిగిలినవి రూ.1800 విక్రయించానని వివరించారు. మొత్తంగా తనకు  రూ.3.3 లక్షల వరకు ఆదాయం వచ్చిందన్నాడు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమాట ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పలు  రాష్ట్రాలు, నగరాల్లో  కిలో రూ.150 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. ఇటు కర్ణాటకలో ఎక్కువ మొత్తంలో రైతులు టమటాను పండిస్తారు. ముఖ్యంగా కోలార్‌లో చాలామంది రైతులు టమాటాను సాగు చేస్తారు. అయితే చీడపీడలు, పురుగుల బెడదతో రైతులు  కొన్ని నెలలుగా టమాట పంట పండించడం తగ్గించేశారు.  కొందరు రైతులు మాత్రం టమాటాను సాగు చేశారు. అయితే ఇటీవల ధరలు బాగా పెరగడంతో అన్నదాతల పంట పండింది. టమాటా విక్రయిస్తూ లక్షాధికారులు అవుతున్నారు.