
కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్‌లో చేరారు. నిన్న ఎమ్మెల్యే పదవి, బీజేపీకి రాజీనామా చేసిన ఆయన..ఏప్రిల్ 17న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, సిద్ధరామయ్య సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి జగదీశ్ కు కాంగ్రెస్ తరుపున టిక్కెట్ దక్కే అవకాశం ఉంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగదీష్.. గతంలో కర్ణాటక సీఎంగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.
సీనియర్ నాయకుడనైన తనకు బీజేపీ నుంచి టిక్కెట్ వస్తుందని అనుకున్నాననని జగదీశ్ శెట్టర్ అన్నారు. కానీ నాకు అది రాలేదని తెలియగానే షాక్‌కు గురయ్యానని తెలిపారు. ఎవరూ తనతో మాట్లాడలేదని.. కనీసం ఒప్పించే ప్రయత్నం చేయలేదని చెప్పారు. తనకు బీజేపీ ఎలాంటి హామీ ఇవ్వలేదని జగదీశ్ శెట్టర్ అన్నారు. అటు జగదీష్ కు పెద్ద పదవిని ఇస్తామని బీజేపీచీఫ్ జేపీ నడ్డా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై వెల్లడించారు.
కర్ణాటకలో మే 10న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెల్లడించనున్నారు. 224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119మంది, కాంగ్రెస్‌కు 75 మంది, జేడీఎస్‌కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి.