బెంగళూరులో నైట్ లైఫ్ను ఎంజాయ్ చేసేవారికి కర్నాటక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బెంగళూరు నగరంలోని బార్స్, హోటల్స్, షాప్స్, లైసెన్స్ ఉన్న వ్యాపార సంస్థలన్నీఇకపై అర్థరాత్రి 1 గంట వరకూ కార్యకలాపాలు కొనసాగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) పరిధిలో ఉన్న అన్ని వ్యాపార సంస్థలకు ఈ అవకాశం ఉంది. జులై 29 డేట్తో అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం.. సీఎల్4 (క్లబ్ లైసెన్స్), సీఎల్6 (ఏ) (స్టార్ హోటల్ లైసెన్స్), సీఎల్7 (హోటల్ అండ్ బోర్డింగ్ హౌస్ లైసెన్స్), సీఎల్7డి (ఎస్సీ, ఎస్టీ వ్యక్తులకు చెందిన హోటల్ అండ్ బోర్డింగ్ హౌస్లకు ఇచ్చే లైసెన్స్).. ఈ లైసెన్స్ ఉన్న వ్యాపారులు ఉదయం 9 గంటల నుంచి అర్థరాత్రి ఒంటి గంట వరకూ కార్యకలాపాలు సాగించవచ్చు. సీఎల్9 (రీఫ్రెష్మెంట్ రూం (బార్)) లైసెన్స్ ఉన్న వ్యాపారులు ఉదయం 10 గంటల నుంచి అర్థరాత్రి 1 గంట వరకూ వ్యాపారాలు చేసుకోవచ్చని సిద్ధరామయ్య ప్రభుత్వం వ్యాపారులకు వెసులుబాటు కల్పించింది.
నైట్ లైఫ్ వేళలను ప్రభుత్వం పొడిగించడంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. ఫుడ్ స్టాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, బార్స్కు లేట్ నైట్ వెళ్లే బ్యాచ్కు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వరం కానుంది. అంతేకాకుండా.. బెంగళూరులో ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ నైట్ లైఫ్ కూడా బిజీబిజీగా గడిపే వారికి ఒంటి గంట వరకూ రెస్టారెంట్స్, హోటల్స్ తెరిచి ఉంచడం కచ్చితంగా ఊరట కలిగించే అంశమే. ఇప్పటిదాకా బెంగళూరులో హోటల్స్, క్లబ్స్, బార్స్కు రాత్రి 10 లేదా 11 గంటల వరకూ మాత్రమే అనుమతి ఉండేది.
2016లో కూడా ప్రభుత్వం ఈ లేట్ నైట్ వ్యాపారాలకు అనుమతించింది. అయితే.. నగరవాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రాత్రి 11 గంటల్లోపు బెంగళూరులో అన్ని వ్యాపారాలు దాదాపుగా బంద్ అయ్యేవి. ఇకపై బెంగళూరులో లోకల్ బార్స్, రెస్టారెంట్స్లో అర్థరాత్రి ఒంటి గంటకు కూడా మద్యం పుచ్చుకునే వెసులుబాటు మందుబాబులకు దొరికింది. ఉదయం 6 నుంచి అర్థరాత్రి 1 వరకూ కస్టమర్లు మందు పొందే అవకాశం ప్రభుత్వ తాజా నిర్ణయంతో మద్యం ప్రియులకు దక్కింది.