ప్రైవేట్‌ జాబ్స్​లో కోటాపై కర్నాటక వెనక్కి

ప్రైవేట్‌ జాబ్స్​లో కోటాపై కర్నాటక వెనక్కి
  • ప్రైవేట్ కంపెనీలు వ్యతిరేకించడంతో  నిర్ణయం
  • బిల్లును పునఃపరిశీలిస్తామన్న సీఎం సిద్ధరామయ్య 
  • త్వరలో మరోసారి కేబినెట్‌ భేటీ నిర్వహిస్తామని వెల్లడి

బెంగళూరు: కర్నాటకలో  ప్రైవేటు  ఉద్యోగాల్లో  కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై సీఎం సిద్ధరామయ్య సర్కార్ వెనక్కి తగ్గింది. కోటాపై ప్రైవేట్ కంపెనీల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో బిల్లును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం సీఎం ట్వీట్ చేశారు.

" ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్, ఎంటర్‌ప్రైజెస్ జాబుల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లు ఇంకా తయారీ దశలోనే ఉంది. దీనిపై తదుపరి కేబినెట్‌ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం" అని సీఎం పోస్ట్ చేశారు. 

అసలేం జరిగిందంటే..

రాష్ట్రంలోని ప్రైవేటు కంపెనీల్లో  కన్నడిగులకు ఉద్యోగాలు దొరకడంలేదని, వారికి రిజర్వేషన్ కల్పించాలని కర్నాటక సర్కార్ నిర్ణయించింది. ప్రైవేట్ సంస్థల్లోని గ్రూప్ సీ, డీ గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకే 100% రిజర్వేషన్లు కల్పించేలా బిల్లు  తయారు చేసింది. ఈ  బిల్లును రాష్ట్రమంత్రి వర్గం సోమవారం ఆమోదించింది. ఇది చట్టంగా మారితే..ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన యజమాన్యంపై రూ. 10 వేల నుంచి రూ. 25 వేల జరిమానా విధిస్తారు.

ఈ ముసాయిదా  బిల్లుకు కేబినేట్ ఆమోదం తర్వాత సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.." రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పరిశ్రమల్లో  సి, డి గ్రేడ్ పోస్టులకు సంబంధించి 100 శాతం కన్నడిగుల నియమకాన్ని తప్పనిసరి చేసే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర యువత సొంత గడ్డపై ఉద్యోగాలు కోల్పోకుండా చూడాలనేదే మా ప్రభుత్వ ఆకాంక్ష. మాది కన్నడ అనుకూల ప్రభుత్వం" అని పేర్కొంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. సీఎం ప్రకటనపై ప్రైవేట్ యాజమాన్యాలు ఫైర్ అయ్యాయి.  దాంతో సీఎం తన ట్వీట్ ను తొలగించారు. ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత రావడంతో కార్మిక మంత్రిత్వ శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తాము ప్రైవేటు సంస్థల్లో నాన్ మేనేజ్‌మెంట్ కోటాలో 70 శాతం, మేనేజ్‌మెంట్ కోటాలో 50 శాతం పోస్టులను మాత్రమే కన్నడిగులకు కేటాయించాలని చెప్పినట్లు వెల్లడించింది.