
3 రోజులు బస్సులు నడుపుతున్న కర్నాటక సర్కారు
బెంగళూరు: లాక్ డౌన్ వల్ల వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని సొంతూళ్లకు పంపేందుకు జిల్లాల మధ్య బస్సులు నడపాలని కర్నాటక సర్కారు డిసిషన్ తీసుకుంది. మూడురోజులపాటు బస్సులు నడుపుతామని, దీనికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం బీఎస్ యడియూరప్ప ఆదివారం చెప్పారు.
‘పేద కార్మికుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ఆదివారం నుంచి మూడు రోజులపాటు బస్సులు నడుపుతాం. బెంగళూరుతోపాటు వివిధ జిల్లా కేంద్రాల నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తాం’అని అన్నారు. అంతకు ముందు వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లేందుకు బస్సులను అందుబాటులో ఉంచుతామని, అయితే చార్జీలను వాళ్లే భరించాలని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సొంతూళ్లకు వెళ్లేందుకు ఆదివారం బెంగళూరులోని బస్ స్టేషన్ కు వేలాది మంది కూలీలు తరలివచ్చారు. అయితే పెంచిన బస్సు చార్జీలు చెల్లించలేక ఆందోళనకు దిగారు. వారికి కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ మద్దతు పలికారు. ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. వలస కార్మికులను సొంతూళ్లకు పంపేందుకు కర్నాటక ఆర్టీసీకి తమ పార్టీ నుంచి కోటి రూపాయలు ఇస్తామన్నారు. అవసరమైతే కర్నాటక సర్కారుకు కూడా విరాళం ఇస్తామని చెప్పారు.
ప్రతిపక్షం విమర్శలు చేయడంతో వలస కూలీలు అందర్నీ బస్సుల్లో ఫ్రీగా సొంతూళ్లకు పంపిస్తామని సీఎం యడియూరప్ప ప్రకటించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు బెంగళూరులోని మెజెస్టిక్ లో బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు చెప్పారు. స్క్రీనింగ్ తర్వాతే సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతిస్తామన్నారు. బస్సులు ఎక్కేటప్పుడు, బస్సులో సోషల్ డిస్టెన్స్ పాటించాలని విజ్ఞప్తి చేశారు.