బ్లాక్​మెయిల్​ చేస్తున్నరని..మఠాధిపతి ఆత్మహత్య

బ్లాక్​మెయిల్​ చేస్తున్నరని..మఠాధిపతి ఆత్మహత్య

రామనగర(కర్నాటక): రామనగర జిల్లా కెంపుపుర గ్రామంలోని కంచుగల్​బండే మఠాధిపతి బస్వలింగ స్వామి(45) సోమవారం సూసైడ్​ చేసుకున్నారు. ఎప్పుడూ ఉదయం 4గంటలకే నిద్ర లేచే బస్వలింగ స్వామి, ఆరు కావస్తున్నా గది తలుపులు తెరవలేదు. అక్కడి స్వామిజీలు కాల్​ చేసినా రెస్పాన్స్​ లేదు. అనుమానం వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా.. కిటికీకి ఉరేసుకుని కనిపించారు. దీంతో వెంటనే స్వామీజీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గదిని పరిశీలించగా, పోలీసులకు రెండు పేజీల సూసైడ్​ నోట్ దొరికింది. ఓ మహిళ ఆడియో కన్వర్సేషన్​ను కూడా ఫోన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. తనను మఠాధిపతి స్థానం నుంచి దించేందుకు కొందరు బ్లాక్​మెయిల్​ చేస్తున్నట్టు బస్వలింగ స్వామి సూసైడ్​ లెటర్​లో చెప్పారు. తన వ్యక్తిత్వాన్ని తప్పుబడుతూ బెదిరింపులకు గురి చేస్తున్నారని వివరించారు. బ్లాక్​మెయిల్​ చేస్తున్న వారి పేర్లను కూడా లేఖలో ప్రస్తావించారు.

అయితే వారి పేర్లు చెప్పేందుకు పోలీసులు నిరాకరించారు. పోస్టుమార్టం తర్వాత సోమవారం సాయంత్రం మఠంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 1997లో బస్వలింగ స్వామి, కంచుగల్​బండే మఠాధిపతిగా నియమితులయ్యారు. కొన్ని నెలల కిందే సిల్వర్​ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. పోయిన ఏడాది డిసెంబర్​లోనూ చిలుమే మఠాధిపతి బస్వలింగ స్వామి ఉరేసుకుని సూసైడ్​ చేసుకున్నారు. ఆరోగ్యం క్షీణించడంతోనే సూసైడ్​ చేసుకున్నట్టు అక్కడి స్వామిజీలు చెప్పారు. 2నెలల కింద బెల్గాంలోని శ్రీ గురు మడివళేశ్వర మఠంలోని బసవ సిద్ధలింగస్వామి కూడా నోట్ రాసి సూసైడ్​ చేసుకున్నారు.