ఎడిట్ చేశాడు.. లోపలేశారు : అయోధ్య ఫొటోలపై పాకిస్తాన్ జెండాలు

ఎడిట్ చేశాడు.. లోపలేశారు : అయోధ్య ఫొటోలపై పాకిస్తాన్ జెండాలు

అయోధ్యలోని రామమందిర ఆలయం ఫోటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.  కర్ణాటకలోని గదగ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి..  అయోధ్య రామమందిర ఆలయంపై పాకిస్తాన్ జెండాలు ఉంచినట్లు ఎడిట్ చేశాడు.  అంతేకాకుండా కింద బాబ్రీ మసీదు అని రాసి సోషల్ మీడియాలో పోస్ట్  చేశాడు. ఈ ఫోటో కాస్త వైరల్ కావడంతో రామభక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజుద్దీన్ దఫేదార్ అనే 33 ఏళ్ల  వ్యక్తిని అరెస్ట్ చేశారు. 

విచారణలో తాజుద్దీన్ తాను ఫేస్‌బుక్‌లో ఈ   పోస్ట్ చూశానని, అనుకోకుండా షేర్ చేశానని పోలీసులకు చెప్పాడు. అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజున కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది.  పోలీసు అధికారులు నిందితుడు సోషల్ మీడియా నుంచి  పోస్ట్‌ను తొలగించేలా చేశారు. తాజుద్దీన్  పై IPC సెక్షన్లు 295A (మత భావాలను రెచ్చగొట్టడం), 153A (సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) కింద కేసు నమోదు చేశారు పోలీసులు.  దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని పోలీసులు తెలిపారు.