ఫ్రెషర్స్ పార్టీ.. 182 మందికి పాజిటివ్

ఫ్రెషర్స్ పార్టీ..  182 మందికి పాజిటివ్

కొత్త వేరియంట్ ఎంట్రీతో కర్నాటకలో కోవిడ్‌ కేసులు మళ్లీ పెరిగాయి. కరోనా కొత్త వేరియంట్ వస్తోందని ఓ వైపు కేంద్రం హెచ్చరికలు చేస్తుండగానే.. కాలేజీలు, క్యాంపస్ లలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.  ధార్వాడలోని ఓ మెడికల్ కాలేజీలో 182మంది స్టూడెంట్స్‌కు కరోనా సోకింది . కర్నాటక ధర్వాడలో ఓ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ చేసుకున్న ఫ్రెషర్స్ పార్టీ కోవిడ్ వ్యాప్తికి కారణం అయ్యింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నవారందరికీ కూడా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. 

ముందుగా 66 మందికి పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 182కు చేరింది. క్యాంపస్‌లో ఇటీవల నిర్వహించిన ఫ్రెషర్స్ పార్టీలో విద్యార్థులు, సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దీంతో ఈ పార్టీ కాస్త వైరస్ వ్యాప్తికి దారితీసిందని అధికారులు తెలిపారు. గురువారం, 300 మందికి పైగా విద్యార్థులు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే కరోనా టీకాలు వేసుకున్న 66 మంది విద్యార్థులు మరియు కళాశాల సిబ్బందికి పాజిటివ్‌గా తేలింది. మరోవైపు మిగిలిన వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఆ సంఖ్య కాస్త 182కు చేరింది.

పాజిటివ్ వచ్చిన వ్యక్తుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. "విద్యార్థులతా కరోనా టీకాలు తీసుకున్నవారే. దీంతో వైరస్ లో కొత్త వేరియంట్ ఉందో లేదో తనిఖీ చేయడానికి మేము జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం కొన్ని నమూనాలను పంపుతాము" అని ఆరోగ్య కమిషనర్ డి రణదీప్ తెలిపారు. నవంబర్ 17న కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్ పార్టీ ఈ వ్యాప్తికి కారణమని ఆరోగ్య కమిషనర్ పేర్కొన్నారు. 

కరోనా సోకిన వారందర్నీ క్వారంటైన్ కు తరలించామన్నారు జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు. హాస్టల్స్ కూడా మూసివేశామన్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిని సైతం ఐసోలేషన్ లో ఉంచామన్నారు. కొందరిలో తేలిక పాటి కరోనా లక్షణాలు ఉంటే.. మరికొందరిలో మాత్రం అసలు ఎలాంటి లక్షణాలు లేవన్నారు. అందర్నీ క్యాంపస్ లోపలే ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. అటు ఒడిశా వైద్య కళాశాలలో కూడా 54 మందికి పాజిటివ్‌ రావడంతో నాలుగు హాస్టళ్లను మైక్రో కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. పది రోజులపాటు ప్రత్యక్ష తరగతులను సస్పెండ్ చేశారు.