కర్నాటకలో కళ్ల కలక కలకలం : వారంలో 40 వేల కేసులు

కర్నాటకలో కళ్ల కలక కలకలం : వారంలో 40 వేల కేసులు

దేశంలో కండ్ల కలక కలకలం సృష్టిస్తోంది.  ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తో పాటు పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమాదవుతున్నాయి. కర్ణాటకలో  జులై 25 నుంచి ఆగస్టు  4 వతేదీ వరకు  40 వేల 477  కండ్లకలక కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అడెనోవైరస్ కండ్లకలక ఈ సంవత్సరం అత్యంత ఎక్కువ కేసులను నమోదు చేస్తోంది.   కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఇన్ఫెక్షన్ వేగంగా విస్తరిస్తోంది. మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో కండ్ల కలక ఆందోళన కలిగిస్తోంది. 

కర్నాటకలోని బీదర్ ( 7వేల693)లో కేసులు, హవేరీలో  ( 6వేల6558) , రాయచూర్ ( 6 వేల 493) కేసులు నమోదయ్యాయి.  ఇక శివమొగ్గ (3 వేల 411), హాసన్ ( 1279), విజయనగర (2 వేల 200), బెలగావి  ( 1843 కేసులు) నమోదయ్యాయి. బెంగళూరులోని మహానగర పాలికే (బీబీఎంపీ) పరిధిలో 400 కేసులు నమోదయ్యాయి.

కండ్లకలక కేసులు ఎక్కువగా నమోదుకావడంతో  ధార్వాడ్‌లోని సివిల్ ఆసుపత్రిలో  ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అయితే జులై నెలతో పోలిస్తే ఇప్పుడు కొంతమేరకు కేసులు తగ్గాయని  బెంగళూరులోని శంకరా ఐ హాస్పిటల్‌ వైద్యులు డాక్టర్ ఆనంద్ బాలశుభ్రమణ్యం తెలిపారు. ఇది అంటు వ్యాధి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

ఒకే ఇంట్లో వారు  ఎక్కువ మంది కండ్లకలక బారిన పడ్డారని అధికారులు తెలిపారు. తీవ్ర ఆందోళన కలిగిస్తోన్న కండ్లకలక ఎరుపు, దురద, విపరీతమైన చిరాకు వంటి లక్షణాలతో కేసులు నమోదవుతున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతాలలో సంచరించే వారికి, కార్యాలయాలకు వెళ్లేవారికి, పిల్లలకు పింక్ ఐ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.  గత వారం బెంగళూరులోని మింటో కంటి ఆసుపత్రిలో ఆరుగురు వైద్యులకు కండ్లకలక సోకింది.  కండ్లకలక లక్షణాలు కనిపిస్తే అశ్రద్ద చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. కళ్లు ఎర్రగా, దురదగా ఉన్న వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.