
2016లో 25 కేసులు, 2017లో 289.. వెయ్యి శాతం పెరుగుదల
తెలంగాణలో 55, ఏపీలో 199 కేసులు నమోదు
‘క్రైమ్ ఇన్ ఇండియా’ నివేదిక వెల్లడి
అవినీతి కేసుల్లో కర్నాటక దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కర్నాటకలో 2016తో పోలిస్తే 2017లో అవినీతి కేసులు వెయ్యి శాతం పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సీఆర్ బీ) ఇటీవల విడుదల చేసిన ‘క్రైమ్ ఇన్ ఇండియా 2017’ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఈ రాష్ట్రంలో 2016లో 25 అవినీతి కేసులు మాత్రమే నమోదు కాగా, 2017లో 289 కేసులు (వెయ్యి శాతం పెరుగుదల) నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కర్నాటకతో సహా 11 రాష్ట్రాల్లో అవినీతి కేసులు బాగా పెరిగాయి. దేశం మొత్తంమీద 2016లో 4,439 అవినీతి కేసులు రిజిస్టర్ కాగా, 2017లో 4,062 అవినీతి కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 377 కేసులు తగ్గాయి.
కేరళలో 67% తగ్గుదల
దేశంలో అవినీతి కేసులు కేరళలోనే అత్యధికంగా 67% తగ్గాయి. దక్షిణాదిన కేరళ, కర్నాటక, ఏపీ, తెలంగాణ, తమిళనాడు మొత్తం ఐదు రాష్ట్రాలు కలిపి చూస్తే 2016లో 878 నుంచి 2017లో 942 కేసులకు స్వల్పంగా పెరిగాయి. కొన్ని యూటీల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్కో కేసు మాత్రమే నమోదైనట్లు నివేదిక పేర్కొంది. అయితే కర్నాటకలో 2015లో 259 కేసులు నమోదు అయ్యాయని, 2016లో కేవలం 25 కేసులే నమోదు కావడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అవినీతి కేసులను రిపోర్ట్ చేయడంలో కర్నాటక ఎన్ ఫోర్స్ మెంట్ వ్యవస్థ చాలా బాగా పని చేస్తోందని, ఇతర రాష్ట్రాలు అలా పనిచేయనందున అక్కడ కేసుల సంఖ్య తక్కువగా కనిపిస్తోందని అంటున్నారు.
తెలంగాణలో తగ్గాయి.. ఏపీలో పెరిగాయి..
‘క్రైమ్ ఇన్ ఇండియా 2017’ రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో మూడేండ్లలో అవినీతి కేసులు వరుసగా తగ్గిపోయాయి. రాష్ట్రంలో 2015లో 193, 2016లో 89, 2017లో 55 అవినీతి కేసులు నమోదయ్యాయి. దేశంలోని మొత్తం అవినీతి కేసుల్లో తెలంగాణ వాటా 1.4 శాతంగా ఉంది. అలాగే ఏపీలో 2016లో తగ్గి, 2017లో పెరిగాయి. ఏపీలో 2015లో 185, 2016లో 164, 2017లో 199 అవినీతి కేసులు నమోదయ్యాయి. దేశంలోని మొత్తం అవినీతి కేసుల్లో ఏపీ వాటా 4.9 శాతంగా నమోదైంది.