కరోనా క్యూర్ ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్‌ల ట్రయల్స్ నిలిపివేత

కరోనా క్యూర్ ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్‌ల ట్రయల్స్ నిలిపివేత

బెంగళూరు: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రమవుతోంది. దేశంలో కూడా కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వ్యాక్సిన్ కోసం పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఆయుర్వేదంలో కూడా కరోనాను నిలువరించే మందును తీసుకొచ్చే యత్నాలు సాగుతున్నాయి. బెంగళూరు కేంద్రంగా ఆయుర్వేదంలో కరోనా క్యూర్‌‌ను తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఈ పరిశోధనలకు బెంగళూరు మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (బీఎంసీఆర్‌‌ఐ) ఎథిక్స్ కమిటీ బ్రేక్ వేసింది. ఆయుర్వేద ట్యాబెట్‌లైన భౌమ్య, సాత్మ్యాకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను ఆపేయాలని బీఎంసీఆర్‌‌ఐ ఎథిక్స్ కమిటీ నిర్ణయించింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆయుర్వేదిక్ మెడికల్ ప్రాక్టీసనర్ డాక్టర్ గిరిధర్ కాజె ఈ మెడిసిన్స్‌ తయారీపై పని చేస్తున్నారు. ట్రయల్స్ సక్సెస్ గురించి ఎథిక్స్ కమిటీకి తెలియజేయకుండా మీడియాకు వెల్లడించిరాని తెలిసింది.

‘ట్రయల్స్ ఇంకా ప్రిలిమినరీ స్టేజ్‌లోనే ఉంది. ఎథిక్స్ కమిటీ ముందు ట్రయల్స్ రిజల్ట్స్‌ గురించిన ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ట్రయల్ సక్సెస్ అయిందని ప్రజల ఎదుట చెప్పారు. ఇది మన్నించ తగినది కాదు. బాధ్యతారాహిత్యం క్షమించరానిది. మీరు వెంటనే మీడియా ముందు దీన్ని క్లారిఫై చేయాలి. లేదంటే ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు మీ ట్రయల్‌ను సస్పెండ్ చేస్తాం’ అని కాజెకు ఇచ్చిన లెటర్‌‌లో బీఎంసీఆర్‌‌ఐ హెచ్చరించింది. కాగా ఈ ఆరోపణలను కాజె కొట్టిపారేశారు. జూన్ 7, 25 తేదీల్లో బీఎంసీఆర్‌‌ఐలోని విక్టోరియా ఆస్పత్రిలో ట్రయల్స్ నిర్వహించారని సమాచారం.