ఆర్టీసీ బస్సులో పుట్టిన బిడ్డ.. పురుడుపోసిన కండక్టర్

ఆర్టీసీ బస్సులో పుట్టిన బిడ్డ.. పురుడుపోసిన కండక్టర్

బస్సులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీకి ఉన్నట్టుండి పురిటి నొప్పులు రావడంతో  ఆ బస్సులో ఉన్న  మహిళ  కండక్టర్ ఆమెకు పురుడుపోసి మానవత్వం చాటుకుంది. దీంతో ఆ  గర్భిణీ పండంటి  బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరులో మే 15 సోమవారం రోజున చోటు చేసుకుంది.  బెంగళూరు నుంచి చిక్కమగళూరు వెళ్తున్న బస్సులో మొత్తం 45 మంది ప్రయాణం చేస్తున్నారు.అందులో ఫాతిమా (22) ఒకరు.

బస్సు వెళ్తున్న  సమయంలో ఫాతిమాకు  ప్రసవ నొప్పులు మొదలయ్యాయి.  దీంతో బస్సులోని మహిళా కండక్టర్ వసంతమ్మ బస్సును ఆపమని,  ప్రయాణికులందరినీ కిందకు దిగమని చెప్పింది. ఆ తర్వాత బస్సులోనే బిడ్డను ప్రసవించేందుకు ఫాతిమాకు  సహకరించింది. అంతేకాకుండా తొటి ప్రయాణికుల దగ్గర 15 వందల రూపాయిలను వసూలు చేసి ఫాతిమాకు ఆమె అర్థిక సహాయాన్ని కూడా అందించింది.   

ప్రసవం తరువాత  తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఫాతిమాను అక్కడి నుంచి అంబులెన్స్ లో శాంతిగ్రామ్ ఆసుపత్రికి తరలించారు.  వసంతమ్మ  20 ఏళ్ల క్రితం లేబర్ వార్డులో అసిస్టెంట్ గా పని చేశారు. ఆ తర్వాత కేఎస్ఆర్టీసీలో కండక్టర్ గా చేరారు.

అప్పుడు తీసుకున్న శిక్షణ మహిళకు పురుడు పోయడంలో సహాయ పడింది.   ఈ ఘటనపై కేఎస్ఆర్టీసీ  స్పందించింది. గర్భిణీకి పురుడు పోసిన కండక్టర్ ను, అలాగే మహిళా ప్రయాణికులను అభినందించింది.