నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్‌

నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్‌

తెలంగాణలో గతేడాది జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా నిలిచిన బర్రెలక్క.. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ నుంచి పార్లమెంట్ బరిలో నిలుస్తున్నారు శిరీష.  ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం రోజున ఎలాంటి హడావుడి లేకుండా తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో వచ్చి  నాగర్ కర్నూల్ సమీకృత జిల్లా కార్యాలయంలో స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. 

 ఇప్పటికే  నాగర్​కర్నూల్ లోక్​సభ నుంచి పోటీకి మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. కాంగ్రెస్ ​నుంచి మల్లు రవి,  బీజేపీ నుంచి పోతుగంటి భరత్​ప్రసాద్, బీఆర్ఎస్ నుంచి​ఆర్.ఎస్.​ ప్రవీణ్​కుమార్ బరిలో ఉన్నారు.  కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో  కొల్లాపూర్ నుంచి  పోటీ చేసిన బర్రెలక్క..  5 వేల 754 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచారు.  

ఓడిపోయినా నిరుద్యోగుల తరఫున తన పోరాటం కొనసాగిస్తానని ఆనాడు చెప్పిన శిరీష చెప్పిన మాట ప్రకారం ఈ లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగింది.  అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన బర్రెలక్క.. ఈ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు సాధిస్తుందో చూడాలి మరి.  మరోవైపు  జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న బర్రెలక్క ఇటీవల రెండో వివాహం చేసుకుంది. పెద్ద కొత్తపల్లి మండలానికి చెందిన వెంకటేశ్‌ అనే యువకుడితో ఈ ఏడాది మార్చి 28వ తేదీన శిరీష వివాహం జరిగిన సంగతి తెలిసిందే.